25-03-2025 01:32:26 AM
మహబూబ్‌నగర్, మార్చి 24 (విజయ క్రాంతి) : జడ్చర్ల పట్టణం మధ్యలో ఉన్న నల్లకుంట చెరువు భూకబ్జాలకు గురి అయిందని ఆరోపణలు బలంగా ఉన్నాయి. నల్లకుంట లో మట్టి పోసి కబ్జాలకు గురి అయిందని పట్టణంలోని ఎవర్ని తట్టిన ఇదే మాట చెబుతారు. ఈ విషయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నల్లకుంట చెరువు భూకబ్జాలపై ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని న్యాయంగా నల్లకుంట భూమి పూర్తిస్థాయిలో చెరువుకే దక్కేలా చూస్తామని చెప్పారు.
గడచిన ఏడాది లో హైకోర్టు నల్లకుంట చెరువును యధావిధిగా ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో అధికారులు గడిచిన ఆరు నెలలకాల వ్యాధిలో నల్లకుంట చెరువు భూకబ్జాల నుంచి అడుగులు తొలగించలేదని ఆరోపణలు వినిపించాయి.
ఈ తరుణంలో విజయక్రాంతి దిన పత్రిక ’నల్లకుంట చెరువును కాపాడేదెవరు’ అనే కథనం ఈనెల 20వ తేదీన ప్రచురితం అయ్యింది. నల్లకుంట చెరువుపై సంబంధిత అధికారులు ఆలస్యమైన స్పందించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నల్లకుంట చెరువుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించేలా అడుగులు వేస్తామని మరోసారి స్పష్టం చేశారు.
నల్లకుంట చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు
జడ్చర్ల పట్టణంలో ఉన్న నల్లకుంట చెరువు రికార్డుల ప్రకారం 10 ఎకరాలు ఉంది. ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం ఈ చెరువు విస్తీర్ణం 7 ఎకరాలు మాత్రమే ఉందని, సంధ్యారాణి, ఇతరులు రెండు ఎకరాల భూమిలో మట్టిని నింపి కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగిందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ విషయంపై పూర్తిస్థాయిలో నల్లకుంట చెరువును కాపాడేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ శాఖలకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా సమగ్ర సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఈ చెరువు విషయం సంబంధించి తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఇరిగేషన్ అధికారులు లేఖలు రాయడం జరిగింది. నల్లకుంట చెరువు పూర్తిస్థాయిలో ఆక్రమణ నుంచి తొలగింపులకు గురి అయితే పట్టణంలో ఈ చెరువు మరింత ఆకర్షనీయంగా కనిపించే అవకాశం ఉంది.
ప్రస్తుతం న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి : ఇరిగేషన్ డీఈఈ
నల్లకుంట ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎఫ్.టీ.ఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగించాల్సిందిగా మున్సిపల్ కమీషనర్, జడ్చర్ల ఎమ్మార్వోలకు లేఖలు రాయడం జరిగింది.గత ఏడాది జనవరి నెలలోనే ఈ విషయం తమ దృష్టికి రాగా ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నాం.
ఈ విషయంగా రెండు సార్లు హైకోర్టులో కేసులు వేయడంతో ఆక్రమణల తొలగింపు ఆలస్యమైయింది. అయితే ఇటీవల ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఎప్.టీ.ఎల్ పరిదిలో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి అనుమతించింది. కమిషనర్, ఎమ్మార్వో ల సహాయంతో నల్లకుంట చెరువులోని ఆక్రమణలను తొలగిస్తాం.
నల్లకుంటలోని భూ కబ్జా ఆక్రమణలను వెంటనే తొలగించాలంటూ గత ఏడాది సెప్టెంబర్ లోనే స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదేశించిన మాట వాస్తవం. జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఎక్కడ కబ్జా చేసినా వదిలేదే లేదు..
గత ఏడాది సెప్టెంబర్ నెలలో చంద్ర గార్డెన్ నందు నల్లకుంట చెరువు ను ఎవరు కబ్జా చేసిన పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. నల్లకుంట చెరువే కాదు నియోజకవర్గంలో ఎక్కడ అక్రమంగా గురైన చర్యలు తీసుకుంటాం. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నాం. కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేది లేదు.
ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నదే మా సంకల్పం. ప్రజాపాలనలో ఎవ రికి అన్యాయం కాకుండా అందరికీ న్యాయం చేస్తున్నాం. నల్లకుంట చెరువుపై ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తిస్థాయిలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముందు కు సాగడం జరుగుతుంది.
అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గం