19-02-2025 01:08:32 AM
నారాయణపేట, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): ఈ వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం చౌరస్తా వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో తాగునీరు-స్వచ్ఛభారత్ మిషన్ ఉపాధి హామీ కూలీలు యాక్షన్ ప్లాన్ 2025 జల శక్తి అభియాన్ వనమహోత్సవ కార్యక్రమాలపై ఎంపీడీవో ఎంపీవో ఉపాధి హామీ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి హామీ పనులు కల్పించి కూలీలకు వేసవిలో అండగా నిలవాలన్నారు. ఉపాధి హామీ పనుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. జిల్లాలో లేబర్ మొబిలైజేషన్ ను ఇంప్రూవ్ చేయాలన్నారు. నర్సరీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయా గ్రామాలలో నర్సరీల ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలన్నారు. 11 సంవత్సరాల పాటు నర్సరీల నిర్వహణ జరుగుతున్నా.. చాలాచోట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ప్రశ్నిం చారు.
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి లేకుండా అన్ని గ్రామాలలో ముందస్తు చర్యలు చేపట్టానన్నారు. మిషన్ భగీరథ ద్వారా నేటి సరఫరా సక్రమంగా జరగాలని ప్రతి గ్రామంలో క్లోరినేషన్ చేయాలని, వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచాలన్నారు. మోటార్లు మరమ్మత్తులు చేయించి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు.
ప్రతి గ్రామంలో పర్యటించి నీటి సరఫరా లో ఆటంకం లేకుండా చూడాలన్నారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప, డిపిఓ కృష్ణ, మిషన్ భగీరథ ఈ ఈ వెంకట్ రెడ్డి, రంగారావు, హౌసింగ్ పీడీ తదితరులు ఉన్నారు.