హెచ్ఎండిఏ పరిధి మండలాల్లోని చెరువులు, కుంటల వివరాలు సిద్ధం చేయాలి
హెచ్ఎండిఏ వెబ్సైట్ లో 8 మండలాలకు చెందిన చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ మ్యాపింగ్ ఉంచాలి
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి హద్దులను ఏర్పాటు చేయాలి
ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు
నీటిపారుదల శాఖ, సేర్వే ల్యాండ్ రికార్డ్ , రెవెన్యూ అధికారులతో కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష
సంగారెడ్డి,(విజయక్రాంతి): చెరువులు కుంటలు అక్రమాలు కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రెవెన్యూ, సేర్వే ల్యాండ్ రికార్డ్, నీటిపారుదల శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని హెచ్ఎండిఏ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన చెరువులు కుంటల పై తాసిల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఏ పరిధిలోని ఎనిమిది మండలాలలో 666 చెరువులు, కుంటలకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ కొరకు మ్యాప్లను సిద్ధం చేయాలన్నారు. హెచ్ఎండిఏకు 666 చెరువులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ మ్యాప్లను పంపాలన్నారు.
వెబ్సైట్లో 666 చెరువుల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయాలన్నారు . చెరువుల మ్యాపులు సిద్ధం చేసేటప్పుడు తప్పులు లేకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసు కోవాలన్నారు. గ్రామంలో చిన్న , పెద్ద చెరువుల ఎఫ్ టి ఎల్ పరిధి, బఫర్ జోన్ల హద్దులు గుర్తించి వాటిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు హెచ్ఎండిఏకు పంపిన మ్యాప్ లో వివరాలతో పాటు మిగిలిన చెరువుల వివరాలు వీలైనంత త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు తప్పనిసరిగా రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు. ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనాలను తొలగించాలన్నారు.
ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎటువంటి నిర్మాణాలను అనుమతించొద్దని అధికారులు ఆదేశించారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఇండ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని , వీటన్నిటిని పరిష్కరించాలని ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు కుంటలు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లతో పాటు వరద కాలువల ఆక్రమణలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సేర్వే ల్యాండ్ రికార్డ్ ఐనేష్, డిఈ యేసయ్య, ఈఈ భీమ్, హెచ్ఎండిఏ పరిధిలోని ఎనిమిది మండలాల తాసిల్దార్ లు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.