calender_icon.png 21 February, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి

19-02-2025 07:30:56 PM

మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా, పంచాయతీ రాజ్, రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష...

సంగారెడ్డి (విజయక్రాంతి): వేసవిలో తాగునీటి సమస్య రాకుండా పట్టణాలు, గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. బిల్లుల వసూలు పట్ల నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లకు పన్నులు వసూలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవికాలంలో జిల్లాలో ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలని  తెలిపారు.

మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో అద్దె బోర్లు తీసుకొని ట్యాంకర్ ఏర్పాటు చేసి అవసరమైన మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో వందశాతం పన్నులు వసూలు లక్ష్యంగా మున్సిపల్ బిల్ కలెక్టర్లు, కమిషనర్లు పని చేయాలని ఆదేశించారు. ఆర్డీవోలు ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లకు సహకరించాలని సూచించారు. ప్రజలు పనులు చెల్లిస్తే  గారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుంటుంది అన్నారు.

మున్సిపాలిటీలలో నీటి పన్ను వసూలు, పరిశ్రమలలో పన్నులు వసూలు చేయాలన్నారు. జిల్లాలో పన్నుల బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేయాలన్నారు. మున్సిపాలిటీలలో అదనపు అంతస్తులు, కళాశాల భవనాలు, పరిశ్రమల నిర్మాణం కోసం దరఖాస్తులను పరిశీలించి వెంటనే పన్నులు వసూలు చేసి అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పార్కుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న పార్కులలో సమస్యలు ఉంటే మరమ్మతులు చేయాలని తెలిపారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువుల పరిరక్షణ ఎఫ్ ఎన్, పీఎన్ దరఖాస్తులు పరిశీలించి, ఎన్ఓసీలు జారీ చేసేటప్పుడు చెరువులను పరిగణలోకి తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులు కలిసి క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని చేయాలన్నారు.

గ్రామాలు పట్టణాలలో రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడ  తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, మిషన్ భగీరథ కనెక్షన్లు, తాగునీటి పైపులు లైన్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఆర్డిఓ రవీందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ అధికారి ప్రతాప్, జిల్లా ఉన్నతాధికారులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.