12-03-2025 12:30:32 AM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల, మార్చి 11 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ నిబంధనల మేరకు లే అవుట్ల అభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్లు 898, 900,93 ప్రాంతాల్లో లే అవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ల అభివృద్ధిలో నిబంధనలను ఖచ్చితంగా పాటిం చాలని, ల్యాండ్ డెవలప్మెంట్ ప్రణాళికకు అనుగుణంగా మౌలిక వసతులు సమకూర్చాలని సూచించారు. సర్వే నంబర్ 898లో లేఅవుట్ తనిఖీ సందర్భంగా అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు
మేస్త్రీలు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేందుకు మేస్త్రీలు శిక్షణను సమర్థవంతంగా ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు. మంగళవారం పాత కలెక్టర్ కార్యాలయం వెనక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ తో కలిసి నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని,మేస్త్రీలకు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతతో నిర్మించేందుకు, ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షల నిధులతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు మేస్త్రీలకు శిక్షణ అందిస్తున్నామని అన్నారు. ఇల్లు కట్టడంలో మేస్త్రీల ప్రాముఖ్యత చాలా ముఖ్యమని సూచించారు. తక్కువ ఖర్చుతో, ఉత్తమ నాణ్యతతో ఇళ్లు నిర్మించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ, ప్రతి మేస్త్రీ శిక్షణలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
ప్రభుత్వం ఈ ఆరు రోజుల శిక్షణలో పాల్గొనే ప్రతి మేస్త్రీకి రోజుకు రూ.300 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్,డి.ఈ నరేందర్,ఎ.ఈ ప్రకాష్,నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అధికారి శివ శంకర్, మేస్త్రీలు, తదితరులు పాల్గొన్నారు.