భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా పాలకులు చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాల్వంచ మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించారని, ఆ తర్వాత స్వార్థ రాజకీయాలతో నాయకులే కేసులు వేయించి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకున్నారాని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు కొత్తగూడెం పాల్వంచ పట్టణాన్ని కలుపుతూ కార్పొరేషన్ చేస్తామని, ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున్ , పాల్వంచ పట్టణ అధ్యక్షులు కోళ్లపూడి ప్రవీణ్ కుమార్, లక్ష్మీదేవిపల్లి మండలం అధ్యక్షులు గూగులోత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.