21-02-2025 12:26:45 AM
టీజీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ ఫరూఖీ
నల్లగొండ, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో వేసవిలో విద్యుత్ సరఫరా కార్యాచరణపై కలెక్టర్ ఇలా త్రిపాఠి, విద్యుత్శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
వారం రోజులుగా సబ్ స్టేషన్లపై లోడ్ పెరుగుతుందని తెలిపారు. గతేడాది ఫిబ్రవరి చివరి నాటికి జిల్లాలో 966 మెగావాట్ల వినియోగం ఉండగా ఈ ఏడాది ఇప్పటికే 1000 మెగావాట్లు దాటిందని వెల్లడించారు.
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. వ్యవసాయానికి మార్చి 15 నాటికి 1,000 మెగావాట్లపైనే విద్యుత్ అవసరం ఉండే అవకాశం ఉందని అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
విద్యుత్ అధికారులు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావొద్దని చెప్పారు. నెట్ వర్క్పై లోడ్ పెరగకుండా చూడాలని ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. అదన కలెక్టర్ జె.శ్రీనివాస్, విద్యుత్ శాఖ డైరెక్టర్ ఎం.నరసింహ, సీఈ కమర్షియల్ భిక్షపతి, రూరల్ సీఈ బాలకృష్ణ, జిల్లా ఎస్‌ఈ ఏ. వెంకటేశ్వర్లు హాజరయ్యారు.