11-02-2025 12:19:57 AM
వనపర్తి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మున్సిపాలిటీలు, గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్లు శుభ్రం చేసే మాన్యువల్ స్కావేంజర్లు ఎవరైనా ఉన్నారా అని ఈ .డి. ఎస్సి కార్పొరేషన్ అధికారిని వివరాలు కోరగా అలాంటి వారు ఇప్పుడు జిల్లాలో ఎవరూ లేరని నివేదిక ఇచ్చారు.
మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల ద్వారా ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా వర్తింపచేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష భీమా పాలసీలు తప్పనిసరిగా చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, ఈ. డి ఎస్సి కార్పొరేషన్ మల్లికార్జున్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.