calender_icon.png 12 March, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గంచెరువు శుద్ధికి చర్యలు

12-03-2025 12:47:06 AM

స్వచ్ఛ జలాలతో కళకళ లాడేలా చూడాలి : బల్దియా కమిషనర్ ఇలంబర్తి

శేరిలింగంపల్లి, మార్చి 11 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి ఐటి జోన్లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా తీర్చిదిద్దాలని బల్దియా కమీషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. చెరువులోకి చేరే మురుగునీటికి పూర్తిగా చెక్ పెట్టి, వర్షపు నీరు వచ్చేలా పూర్తిస్తాయి వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారు లను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని దుర్గం చెరువును జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, జలమండలి, ఎస్‌ఎన్డీపి విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జలమండలి చేపట్టనున్న మురుగునీటి డైవర్షన్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఎస్‌ఎన్‌డిపి ఆధ్వర్యంలో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పురోగతిని ఆయన పరిశీలించారు.

అనంతరం బల్దియా కమీషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ... మురుగనీటిని దారి మళ్లించేలా పటిష్టమైన డ్రైనేజీల నిర్మాణానికి సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ మురుగునీటి పరిమాణాన్ని తట్టుకునేలా తగినంత మోతాదులో పైపుల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వర్షపు నీరు స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ ద్వారా చెరువులోకి చేరేలా పటిష్టమైన నాన్యమైన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దుర్గం చెరువులో పరిశుభ్రమైన జలాలు నింపి ఆహ్లాదకరమైన పరిసరాలను నగర ప్రజానీకానికి అందించేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని కమీషనర్ తెలిపారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులను బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు.