13-03-2025 01:50:54 AM
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ లో మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం, మార్చి 12 ( విజయక్రాంతి): ప్రణాళిక ప్రకారం క్రమ పద్ధతిలో ఖమ్మం నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం మంత్రి, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ నందు అమృత్ 2.0 పథకంలో భాగంగా 249 కోట్ల 52 లక్షలతో మురుగు నీటి పైప్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూవరద వచ్చినప్పుడు చూసుకుందాం అని ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేసిన ఫలితంగా మున్నేరు వరదలు వచ్చాయని తెలిపారు. గత 100 సంవత్సరాల చరిత్ర చూసినా మున్నేరు నది అంత భారీ వరదలు రాలేదని అన్నారు. వరదల సమయంలో ప్రాణ నష్టం కల్గకుండా ప్రజలను కాపాడారని, వరదల తర్వాత ప్రతి ఇంటిని శుభ్రం చేసే వరకు సహాయ, సహకారాలు అందించారని తెలిపారు. గతంలో వచ్చిన పరిస్థితి మరోసారి ఖమ్మం నగరానికి రాకూడదని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కష్టాలు ఉన్నా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు.
కలెక్టర్ చెప్పిన విధంగా దేశంలో అత్యధికంగా పట్టణీకరణ జరుగుతుందని అన్నారు. ప్రజల కోరిక మేరకు ప్రశాంతమైన ఖమ్మం నగరం తయారు చేస్తున్నామని, శాంతి భద్రతలు పకడ్బందీగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలని, వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ ఇప్పటి నుండైనా ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరగాలని అన్నారు.
డ్రైనేజీ పనులను చివరి నుండి ప్రారంభించాలని, 9.5 కిలోమీటర్ల మేర డ్రైనేజీ పనులు చేపట్టామని, ప్రతి కిలో మీటర్ కు రెండు, మూడు యంత్రాలు పెట్టి పనులు కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. రాజీవ్ లింకు కెనాల్ ను 18 యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని, అదే స్పూర్తితో ఇక్కడ పని చేయాలని, 3 నెలల వ్యవధిలో వర్షాకాలం వచ్చే లోపు 9.5 కిలో మీటర్ల డ్రైనేజీ పనులు పూర్తి కావాలని అన్నారు. ఆక్రమణలను తప్పనిసరిగా తొలగిస్తామని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, ఖమ్మం నగర మేయర్ పూనుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ రవికుమార్, కార్పొరేటర్లు చావా నారాయణ రావు, కమర్తపు మురళీ, ఆళ్ల నిరోష, ఇతర కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.