calender_icon.png 26 October, 2024 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పంట బీమా అమలుకు అడుగులు

29-07-2024 02:45:02 AM

  1. సాగు భూముల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నం  
  2. ఆగస్టు నుంచి అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు
  3. బడ్జెట్‌లో రూ.1300 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): పంట బీమా పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రూ.లక్ష వరకు రుణమాఫీ అమలు చేసి అన్నదాతల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ప్రభుత్వం.. పంటల బీమా పథకం కూడా అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఈ వానకాలం సీజన్ నుంచే దానిని అమలు చేయాలనుకుంటున్న సర్కార్.. వ్యవసాయశాఖ ద్వారా  సాగు చేసిన భూముల వివరాలను సేకరిస్తుంది.

గ్రామాన్ని యూనిట్‌గా గైడ్‌లైన్స్ సిద్ధం చేసింది. ఇటీవల బడ్జెట్‌లో బీమా కోసం రూ.1300 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటల సాగువుతాయని అంచనా వేసిన వ్యవసాయశాఖ.. విపత్తులతో పంటలకు నష్టం జరిగితే రైతులకు పరిహారం అందేలా ఏర్పాట్లు చేస్తుంది. గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని 2019 నుంచి నిలిపివేయడంతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరడంతో రాష్ట్రంలో తిరిగి పంటల బీమాను అమలు చేయాలని సంకల్పించింది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. పంటల బీమా కోసం నిర్వహించే టెండర్లలో బీమా కంపెనీలు కోట్ చేసే ప్రీమియం ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఆగస్టు నెలాఖరికి పంట బీమా పత్రాలు అన్నదాతలు అందుకోనున్నారు.  

ఏటా  రూ. 1300 కోట్లు ప్రీమియం 

వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రెండు సీజన్లకు కలిపి ఏటా రూ.1300 కోట్లు ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రైతు వాటా దాదాపు రూ.300 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు సంబంధించిన ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరించి, పంటల బీమా ఉచితంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.