మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో రామగిరి ఖిల్లా సందర్శించిన దేవాదాయ అధికారులు
మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో గల చారిత్రాత్మక రామగిరి ఖిల్లా పర్యాటక కేంద్రం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇటీవల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎంతో చారిత్రాత్మక సంపద కలిగి ఆదరణకు నోచుకోక ఉన్న రామగిరి కిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు రామగిరి ఖిల్లాకు చేరుకొని గుట్టను సందర్శించారు. గుట్టపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సర్వే నిర్వహించారు.
అక్కడ ఉన్న శ్రీరామచంద్రుని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి, వెంకటేశ్వర్లు ఆలయ పూజారి సత్యనారాయణతో కలిసి గుట్టపై కలియ తిరిగారు. పర్యాటక కేంద్రంకు కావలసిన సదుపాయాల గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. వారి వెంట మాజీ జడ్పీటీసీ గంటా వెంకటరమణ రెడ్డి, మంథని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ముస్త్యాల శ్రీనివాస్, మంథని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోత్కూరి అవినాష్ గౌడ్, పన్నూరు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.