ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి ముఖాముఖి చర్చలకోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం మంచి పరిణామం. చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ అంగీకరించడంతో ఈ నెల 6న హైదరాబాద్‌లో ఇరువురు నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఇలాంటి సమావేశం ఎప్పుడో జరగాల్సింది. ఎం దుకంటే, రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు గడిచిపోయాయి. ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గత జూన్ 2 నుంచి తెలం గాణకు మాత్రమే రాజధాని అయింది. అంటే, ఇప్పటి వరకు హైదరాబాద్‌పై ఏపీకి ఉన్న హక్కులు తీరిపోయాయి.
దీంతో హైదరాబాద్‌లో ఉన్న పలు ఉమ్మడి ఆస్తులు తెలంగాణకు సొంతం కావలసి ఉంది. కానీ, ఆస్తుల పంపకాలపై ఒప్పందం కుదరకపోవడంతో ఆ పని జరగలేదు. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూల్‌లో ఉన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్‌ల ఆస్తులు రెండు రాష్ట్రాలమధ్య పంపకం కావాల్సి ఉంది. అధికారుల లెక్కల ప్రకారం ఇలాంటి సంస్థలు, కార్పొరేషన్లు దాదాపు 89 ఉన్నాయి. వీటిలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్, ఏపీ పోలీసు అకాడమీ లాంటివి ఉన్నాయి. వీటిలో దాదాపుగా అన్నీకూడా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి.
9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర రిటైర్డ్ ఐఎఎస్ అధికారి షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ గతంలోనే సిఫార్సులు అందజేసినా సమస్య అపరిష్కృతంగానే ఉంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన మాత్రమే ఇటీవల పరిష్కారమయింది. విభజన అనంతరం విద్యుత్ సరఫరా బకాయిల వివాదం కూడా రెండు రాష్ట్రాల మధ్య పీటముడిగా మారింది. ఉద్యోగుల బదిలీ సమస్య కూడా తెగలేదు. దాదాపుగా 144 మంది తెలంగాణ ఉద్యోగులు 2014 నుంచి ఏపీలోనే పని చేస్తున్నారు. వీరిని తిరిగి తెలంగాణకు తీసుకు రావాలంటూ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం సమర్పించింది.
ఆర్టీసీ ఆస్తుల విభజన సమస్య కూడా ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. హైదరాబాద్‌లో ఉన్న కార్పొరేషన్ కార్యాలయం ఆస్తుల్లో తమకు వాటా కావాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్నది. అయితే, భిడే కమిటీ ప్రధాన కార్యాలయానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఈ ఆస్తులు తమకే చెందుతాయని తెలంగాణ వాదిస్తున్నది. ఇలా పెండింగ్‌లో ఉన్న సంస్థల ఆస్తుల విలువ దాదాపు లక్షా 40 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్లు రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
ఈ సమస్యలకన్నా మించిన సమస్య కృష్ణా జలాల పంపిణీ వివాదం. రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కృష్ణా జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలమధ్య వివాదం కొనసాగుతున్నది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా రాయలసీమకు తరలించుకు పోతున్నదని తెలంగాణ ఆరోపి స్తున్నది. అలాగే, విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నీటిని వృథా చేస్తున్నదని ఏపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఇరు రాష్ట్రాలు కూడా అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఒక్కోసారి ఈ వివాదం ముదిరి ఉమ్మడి ప్రాజెక్టులయిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వారంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నా ఆచరణ లో ఈ వివాదాల కారణంగా అప్పుడప్పుడు అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికయినా చర్చల ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరిం చుకోవడానికి ఇద్దరు సీఎంలు చొరవ తీసుకోవడంతో ఈ దిశగా ఓ ముందడుగు పడాలని ఆశిద్దాం.