calender_icon.png 2 November, 2024 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతకానికి అడుగు దూరంలో

05-08-2024 12:05:00 AM

  1. సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు
  2. క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై విజయం
  3. షూటౌట్ ద్వారా ఫలితం

పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీ మిండియా 4 పటిష్టమైన గ్రేట్ బ్రిటన్‌ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి పతకానికి అడుగుదూరంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు ఈసారి స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ కలను నిజం చేసుకోవడాని కి మరొక అడుగు దూరంలో నిలిచింది. పటిష్టమైన బ్రిటన్ జట్టు ముందు మన ఆటలు సాగనప్పటికీ భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థికి కొరకరాని కొయ్యగా మారి అడ్డుగోడలా నిలిచాడు. బ్రిటన్ డిఫెన్స్‌ను సమర్థంగా అడ్డుకున్న శ్రీజేష్ మ్యాచ్‌లో నిజమైన హీరోగా నిలిచాడు. ఒలింపిక్స్ తన చివరి టోర్నీ అని ప్రకటించిన శ్రీజేష్ భారత్‌కు స్వర్ణం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

10 మందితోనే..

మ్యాచ్ ఆరంభం నుంచి ఆట రంజుగా సాగింది. ఇరుజట్లు గోల్ కోసం శ్రమించాయి. అయితే గోల్‌కీపర్లు సమర్థంగా అడ్డుకోవడంతో తొలి క్వార్టర్స్‌లో ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభమైన కాసేపటికే టీమిండియా డిఫెండర్ అమిత్ రోహిదాస్ రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడి తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని భావించిన రిఫరీలు రోహిదాస్‌ను రెడ్‌కార్డ్ ద్వారా బయటికి పంపారు. దీంతో తర్వాత మ్యాచ్ మొత్తం భారత్ 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు.

27వ నిమిషంలో బ్రిటన్ తరఫున మోర్టన్ లీ గోల్ చేయడంతో 1 స్కోరు సమం అయింది. అయితే మిగిలిన రెండు క్వార్టర్స్‌లో ఇరుజట్లు గోల్స్ కోసం యత్నించినప్పటికి విఫలమయ్యాయి. నిర్ణీత సమయం ముగియడంతో షూటౌట్ అనివార్యమైంది. ఇక షూటౌట్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సహా సుఖ్జీత్ సింగ్, ఉపాధ్యాయ్ లలిత్ కుమార్, రాజ్‌కుమార్‌లు గోల్స్ కొట్టగా.. బ్రిటన్ తరఫున అల్బేరీ జేమ్స్, జాక్ మాత్రమే గోల్ కొట్టడంతో 4 తేడాతో భారత్ విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.

మంగళవారం సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాం స్యం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఒలింపిక్స్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని స్థాయిలో భారత హాకీ జట్టు ఇప్పటివరకు హాకీలో 8 స్వర్ణాలు గెలిచి రికార్డు సృష్టించింది. చివరగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించింది.

అడ్డుగోడలా శ్రీజేష్

బ్రిటన్‌పై విజయం సాధించడంలో భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర కీలకం. ఒలింపిక్స్ తన చివరి అంతర్జాతీయ టోర్నీ అని పేర్కొన్న శ్రీజేష్ భారత్‌కు పతకం అందించడం కోసం ప్రాణం పెడుతున్నాడు. అది ఎంత అనేది ఇవాళ బ్రిటన్‌తో పోరులో చూస్తే స్పష్టమవుతోంది. అమిత్ రోహిదా స్ రెడ్‌కార్డ్‌కు గురవ్వడం.. డిఫెన్స్ అటాకింగ్‌లో ఒక ఆటగాడు తగ్గిపోయినట్లే. ఈ నేపథ్యంలో శ్రీజేష్ తన అనుభవాన్ని రంగరించి మ్యాచ్ ఆద్యంతం అడ్డుగోడలా నిలిచాడు. బ్రిటన్ ప్లేయర్లు అడుగుడుగునా అటాకింగ్ గేమ్‌తో ఎదురుదాడి చేసినప్పటికీ శ్రీజేష్ తన శక్తిని మొత్తం దారపోసి అడ్డుగా నిలిచి ప్రత్యర్థి గోల్స్ చేయకుండా అడ్డుకున్నాడు. రెండు క్వార్టర్ల పాటు బ్రిటన్ గోల్ చేయలేకపోయిందంటే శ్రీజేష్ పాత్ర ఎంతో ఉంది. ఈసారి ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించి శ్రీజేష్ తన కెరీర్‌ను ముగించాలని ఆశిద్దాం.