calender_icon.png 27 April, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ నిర్మాణంలో ఉక్కు పాత్ర కీలకం

27-04-2025 12:12:24 AM

ముంబై స్టీల్ ఇండియా కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): దేశ నిర్మాణంలో ఉక్కు పాత్ర ఎంతో గణనీయమైందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముంబైలో శనివారం జరిగిన స్టీల్ ఇండియా అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు. వికసిత్ భారత్ 2047లో ఉక్కు కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు.

దేశ మౌలిక సదుపాయాల కల్పనలో ఉక్కు పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. కశ్మీర్ చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జి, తమిళనాడులోని పాంబన్ వంతెన ఉక్కు రంగం ప్రాధాన్యతను తెలియచేస్తాయన్నారు. దేశ ఉక్కు రంగం ఇటీవలి కాలంలో ఆకర్షణీయమైన వేగంతో అభివృద్ధి చెందిందని.. ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా దేశాన్ని నిలబెట్టిందని ఆయన అన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా దేశీయ వినియోగం, పారిశ్రామిక విస్తరణ, స్వావలంబనకు ప్రధాన చోదకమైన ఉక్కును దేశ సన్‌రైజ్ సెక్టార్‌గా మంత్రి అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థకు ఉక్కు వెన్నెముకగా ఉండే బొగ్గు, గనుల రంగం బలమైన దేశ పునాదులుగా పేర్కొన్నారు. ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, మాంగనీస్, నికెల్, క్రోమియం వంటి కీలకమైన ముడి పదార్థాల లభ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. దేశం గత ఆర్థిక సంవత్సరంలో బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని సాధించిందన్నారు.