విచారణ 28కి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అందిన ఫిర్యాదులో మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్ట్‌పై గతంలో ఇచ్చిన స్టేను శుక్రవారం హైకోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని హరీశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారని తెలిపారు. దీనిపై సమాధానం ఇవ్వడానికి ఫిబ్రవరి దాకా గడువు కావాలని కోరారు. కేసు దర్యాప్తులో పిటిషనర్ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ఇప్పటివరకు విచారణకు పిలవలేదన్నారు.
స్టే గడువు ముగిసిపోతున్నందున పొడిగించాలని కోరారు. మరోవైపు ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సంక్రాంతి సెలవులైన వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తూ స్టేను పొడిగించారు.