ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): జయశంకర్ జిల్లా పరిధిలోని మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం హైకోర్టు నిలిపేసింది. గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి పొడిగించింది.
గతేడాది కింది కోర్టు తీసుకున్న నిర్ణ యం అమలును క్రితంసారి విచారణ సమయంలో హైకోర్టు నిలిపివేసింది. కింది కోర్టు లో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేసిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తికి మరోసారి చాన్స్ ఇచ్చింది. విచారణను ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు వ్యవహారంపై ప్రైవేట్ ఫిర్యాదును భూపాలపల్లిలోని మేజిస్ట్రేట్ కోర్టు గతేడాది జనవరి 12న కొట్టివేసింది. దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారించి మాజీ మంత్రులు కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేసిన కేసులో ఫిర్యాదుదారు కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది.