14-02-2025 01:56:20 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మేడిగడ్డ కుంగుబాటుకు నిర్మాణా ల్లో అక్రమాలేనంటూ, అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో సహా బాధ్యులపై దర్యాప్తు జరపాలన్న అభ్యర్థనతో దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలంటూ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి జూలై 10న తీసుకున్న నిర్ణయం అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను గురువారం హైకోర్టు మరోసారి పొడిగించింది.
ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా.. రివిజ న్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్న జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయాన్ని కొట్టివేయాలని కే చంద్రశేఖర్‌రావు, హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు.
అయితే ఫిర్యాదు దారు నాగవెల్లి రాజలింగమూర్తి తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని కోరగా న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటరు దాఖలు చేయడానికి ఎంత కాలం కావాలి? ఏడాది గడువు కావాలా? అంటూ నిలదీశారు. చివరి అవకాశంగా ఈనెల 20కి వాయిదా వేస్తూ ఆలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించారు.
మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలంటూ రాజలింగమూర్తి ఫిర్యాదును మేజిస్ట్రేట్ కొట్టివేసింది. దీంతో రాజలింగమూర్తి జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ విచారణకు అనుమతించడంపై కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
రాజలింగమూర్తి దాఖ లు చేసిన ఫిర్యాదులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న రజత్‌కుమార్, అధికారులు, కాంట్రాక్టర్లు మేఘా, ఎల్‌అండ్టీలను నిందితులుగా చేర్చారు.
పోలీసులకు సంబంధం లేదు..
కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌లో పోలీసుల పాత్ర లేదంటూ భూపాలపల్లి ఎస్సై హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు. రాజలింగమూర్తి ముందు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ రూ.1.35 లక్షల కోట్లు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారన్నారు.
దీనివల్ల మేడిగడ్డ కుంగిపోయిందని, వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. అయితే ఇది తమ పరిధిలోకి రాదంటూ జనరల్ డైరీలో నమోదు చేసి ఫిర్యాదును మూసివేశామన్నారు. దీంతో రాజలింగమూర్తి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా అవినీతి ఆరోపణలపై ప్రత్యేకంగా ఏర్పాటైన అవినీతి నిరోధక కోర్టు విచారించాల్సి ఉందంటూ కొట్టివేయడంతో జిల్లా కోర్టును ఆశ్రయించారన్నారు.
మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై దాఖలైన రివిజన్ పిటిషన్ విచారణ సందర్భంగా జిల్లా కోర్టు నోటీసులు జారీ చేయగా కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఇందులో పోలీసుల పాత్రలేదని, కోర్టుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, అందువల్ల తమకు వ్యతిరేకంగా ఉన్న పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
సెకండ్ షోలకు పిల్లలకు అనుమతించండి
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ అప్పీల్
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాత్రి 11 గంటల తర్వాత ఉద యం 11 గంటలలోపు పిల్లలను సినిమా షోలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది. సెకండ్ షోలకు పిల్లలను అనుమతించరాదంటూ సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.
దీని పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. వాదనలను విన్న హైకోర్టు.. సింగి ల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉన్నందున ఇక్కడ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. దీంతో అప్పీలు ఉపసంహరించుకుంటామని న్యాయవాది చెప్పడం తో బెంచ్ అంగీకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.