29-03-2025 02:26:29 AM
నోటీసులు ఇచ్చి విచారించండి
విష్ణుప్రియ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి యాంకర్ విష్ణుప్రియపై పంజాగుట్ట, మియాపూర్ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో విచారణను నిలిపివేయడానికి శుక్రవారం హైకోర్టు నిరాకరించింది. అయితే బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
బెట్టింగ్ యాప్‌లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని కోరుతూ నటి విష్ణుప్రియ హైకోర్టులో రెం డు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీని పై జస్టిస్ ఎన్.తుకారాంజీ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుల ఆరోపణలన్నీ బెట్టింగ్ యాప్‌లు, కంపెనీలపైనేనని, పిటిషన్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు.
దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. దీనిపై అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్ వీరమల్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో స్టే ఇస్తే ముందుకుసాగద న్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి దర్యాప్తు నిలిపివేతకు నిరాకరిస్తూ, చట్టప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేప ట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.