calender_icon.png 30 March, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితాన్ని ప్రేమించండి మత్తుకు దూరంగా ఉంచండి

26-03-2025 01:36:12 AM

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి, రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శశిధర్‌రెడ్డి 

ఎల్బీనగర్,మార్చి25: రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాసంస్థ, లయన్స్ ఇంటర్నేషనల్ అధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో డ్రగ్స్ పై విద్యార్థులతో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తాత్కాలిక ఆనందం కోసం విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దన్నారు. మత్తు పదార్థాలు తాత్కాలికంగా సంతోషం, ధైర్యం ఆత్మవిశ్వాసం భావనలు ప్రేరేపిస్తాయని, మత్తు ప్రభావం తగ్గగానే ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు.

మాదక ద్రవ్యాలు వ్యక్తి ప్రవర్తన, నడవడికను పూర్తిగా దెబ్బతీసి, భవిష్యత్తు మొత్తాన్ని అంధకారంలోకి నెడుతాయన్నారు.   ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నదని,  మత్తు పదార్థాల తయారీ, సరఫరా, వినియోగంపై  నిషేధించినట్లు తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాలు నిర్వహించి, ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.

రంగారెడ్డి జిల్లా అదనపు జడ్జి డాక్టర్ పట్టాభి రామారావు మాట్లాడుతూ.. ‘మాదకద్రవ్యాలు మన ఆరోగ్యానికే కాకుండా సమాజానికి అపాయాన్ని కలిగించే ప్రమాదం ఉందన్నారు.మత్తుకు అలవాటు పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టమన్నారు.  వ్యసనానికి బానిస అయిన వ్యక్తి క్రమంగా తన ఆరోగ్యాన్ని కోల్పోతాడని, తద్వారా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.   

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. పిల్లలకు స్వాతంత్రం ఇవ్వడమే కాదు.. దాన్ని వాళ్లు ఎలా వినియోగించుకుంటున్నారనే? దానిపై తల్లిదండ్రులు కచ్చితంగా దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులు,  యువత మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ శ్రీదేవి, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు, డిస్టిక్ గవర్నర్ గంప నాగేశ్వరరావు, మల్టీపుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ రాజి రెడ్డి, మల్టీపుల్ లియో కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, పాణనీయ విద్యాసంస్థల డైరెక్టర్ వసుధ, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్ ,  సుమారు 2500 మంది   విద్యార్థులు పాల్గొన్నారు.