యాంటి నార్కోటిక్ బ్యూరో ఎస్ పి సాయి చైతన్య...
మేడ్చల్ (విజయక్రాంతి): విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యాంటి నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య సూచించారు. శనివారం మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలను యువత మొదట్లో ఫ్యాషన్ గా భావిస్తారని తర్వాత వాటికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఉన్నత విద్యావంతులు ఉన్నత ఉద్యోగులు మత్తు పదార్థాలకు బానిసై తమ కెరీర్ను నాశనం చేసుకున్న వారు ఉన్నారన్నారు. మత్తు పదార్థాలు తీసుకునే వారికి ఆర్థిక సహాయం చేసిన క్రైమ్ అవుతుందన్న విషయాన్ని గమనించాలన్నారు.
మత్తు పదార్థాలు తీసుకోవడం టెర్రరిస్ట్, అత్యాచారం, హత్య లాంటి నేరాలతో సమానమన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన, తీసుకున్న తమకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులు, కళాశాల సిబ్బంది చేత మత్తుపదార్థాలకు దూరంగా ఉంటామని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల సెక్రటరీ టీవీ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు డ్రగ్స్ మీద అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టివి రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీలత తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీం డి.ఎస్.పి హరిచంద్రారెడ్డి, సి ఐ శ్రీనివాసరావు, ఎస్సై గోపి, పి ఆర్ ఓ రవి సుధాకర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ రాజేష్ పాల్గొన్నారు.