calender_icon.png 5 October, 2024 | 4:52 AM

నల్లగొండ బీఆర్‌ఎస్ బిల్డింగ్‌పై స్టేటస్‌కో

05-10-2024 02:29:37 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం భవనం కూల్చివేత కేసులో హైకోర్టు శుక్రవారం స్టేటస్‌కో (యథాతథస్థితి) ఆదేశాలిచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ బిల్డింగ్ క్రమబద్ధీకరణను తిరస్కరించిన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేత చర్యలు చేపడతామని నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులను సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి లక్ష రూపాయల జరిమానా విధించడమే కాకుండా పిటిషన్‌ను కొట్టివేశారు.

సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రమావత్ రవీందర్ కుమార్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సీనియర్ అడ్వొకేట్ పీ శ్రీరఘురాం వాదిస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మరో అప్పీల్ పిటిషన్ కూడా విచారణలో ఉందని తెలిపారు.

ఆ అప్పీల్ ఈ నెల 21వ తేదీన విచారణకు రానుందని చెప్పారు. దీంతో రెండు అప్పీళ్లను కలిపి విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు బీఆర్‌ఎస్ పార్టీ బిల్డింగ్ వ్యవ హారంపై స్టేటస్‌కో కొనసాగించాలని కార్పొరేషన్ ఇతర ప్రతివాదులకు మధ్యంతర ఆదేశాలిచ్చింది.