శిల్ప, పీనిక్స్ క్రమబద్ధీకరణ యత్నాలపై పిటిషన్
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ గా పిలిచే సర్వే నంబర్ 32 నుంచి 40 లోని 99 వేల చదరపు గజాల స్థలాన్ని శిల్ప పయనీర్, పీనిక్స్ ఇన్ఫోసిటీలకు క్రమబద్ధీకరణ చేసే ప్రయత్నాలకు హైకోర్టులో బ్రేక్ పడింది. స్థలాన్ని యథాతథంగా (స్టేటస్కో) ఉంచాలని బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. గచ్చిబౌలిలోని 99,013 చదరపు గజాల స్థలానికి సంబంధించి పీనిక్స్ విజ్ఞప్తిని పరిశీలించి, ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా కలెక్టర్‌కు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి గత ఏడాది జూలైలో సూచించారు.
దీనిని మొబైల్ వెల్ఫేర్ సొసైటీలో సభ్యులైన సయ్యద్ ఖాజాం హుసేన్ సహా 145 మంది సవాల్ చేశారు. ఆయా పిటిషన్లను బుధవారం న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జెల్లి కనకయ్య వాదిస్తూ.. ఈ స్థలంలో పేదలు చిన్నచిన్న ఇండ్లు, గుడెసెలు, షెడ్లు నిర్మించుకున్నారని, పన్ను కూడా చెల్లిస్తున్నారని చెప్పారు. 2008లో వెలువడిన జీవో 168, 2014 నాటి జీవో 58, 50 ప్రకారం క్రమబద్ధీకరణకు అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారని చెప్పారు. పిటిషనర్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని పేర్కొన్నారు.
కేంద్ర ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు వీరు అర్హులని తెలిపారు. ఆ స్థలాన్ని శిల్పా పయనీర్, పీనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లకు కట్టబెట్టాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. బడాబాబులకు కట్టబెట్టేందుకే ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి కూడా తొలగించారని చెప్పారు. గతంలో కౌంటర్ వేసేందుకు వాయిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు కూడా గడువు కోరింది. దీంతో హైకోర్టు, గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 37, 40 42 నుంచి 45 దాకా ఉన్న భూమిపై స్టేటస్కో ఉత్తర్వులను జారీచేసింది. విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది.