- మాజీ ఎమ్మెల్యేల విగ్రహాల ఏర్పాటుపై రగడ
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల బాహాబాహీ
సిద్దిపేట/దుబ్బాక, సెప్టెంబర్ 6: దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యేల విగ్రహాల ఏర్పాటు వివాదం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య చిచ్చురేపింది. దుబ్బాక అభివృద్ధి దివంగత మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డితోనే సాధ్యం అయ్యిందని దుబ్బాక కాంగ్రెస్ నాయకులు స్థానిక బస్టాండ్ వద్ద ఆయన విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేయడానికి పిలునివ్వగా.. శుక్రవారం బీఆర్‌ఎస్ నాయకులు అదే స్థలంలో మరో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి విగ్రహ భూమిపూజ ఉండగా కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే అదేస్థలంలో శుక్రవారం రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాటతో పాటు ఒకరిపై ఒకరు కొట్టుకునే దాకా వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో జిల్లా కలెక్టర్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్‌కి ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటుకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని.. వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నతరుణంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కావాలనే అదే స్థలంలో రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ముత్యంరెడ్డి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ట చేసేదాకా విడిచిపెట్టేది లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.