హైదరాబాద్ కలెక్టరేట్లో నిరసన తెలుపుతున్న టీజీఈజేఏసీ సభ్యులు
విజయక్రాంతి న్యూస్ నెట్వర్క్, నవంబర్ 14: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై లగచర్ల గ్రామస్తుల దాడిని ఖండిస్తూ గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. తెలంగాణ ఉద్యోగులు గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ(టీజీఈజేఏసీ) హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యం లో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో, వనపర్తి జిల్లా ఐడీవోసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.