సంగారెడ్డి సెంట్రల్ జైల్లో నిందితులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం
సంగారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): సంగారెడ్డి జైల్లో ఖైదీలుగా ఉన్న లగచర్ల రైతులను జాతీయ మానవ హక్కుల బృందం కలిసింది. ఆదివారం ఉదయం 9గంటలకు సంగారెడ్డి సెంట్రల్ జైల్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ రిజిస్టర్ ముఖేశ్‌తో పాటు వికారాబాద్ జిల్లాలకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో ఏ2గా ఉన్న సురేష్‌తో పాటు ఇతర నిందితులను విచారణ చేశారు.
దాదాపు 5గంటల పాటు కొనసాగిన విచారణలో ఒక్కక్కరి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరి స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డు చేసినట్లు వారు తెలిపారు. అయితే విచారణకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అలాగే జైల్లో 5 గంటల పాటు విచా రణ చేసే సమయంలోనూ ఎవరినీ లోనికి అనుమతి ఇవ్వలేదు.
పూర్తి నివేదకను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. కాగా ఫార్మా భూసేకరణలో భాగంగా అభిప్రాయ సేకరణపై ఇటీవల జరిగిన సమావేశంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడిచేసిన ఘటనలో లగచర్లకు చెందిన పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.