సినిమా ప్రతినిధి, జనవరి 13 (విజయక్రాంతి): హీరోయిన్ అన్షుపై సినీ దర్శకుడు నక్కిన త్రినాథరావు వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారద సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన చైర్‌పర్సన్.. త్వరలోనే త్రినాథరావుకు నోటీసు జారీ చేస్తామని వెల్లడించారు.
అసలేం జరిగిందంటే.. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మజాకా’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ చిత్ర దర్శకుడు త్రినాథరావు హీరోయిన్ అన్షు గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె శరీరాకృతి గురించి త్రినాథరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, ‘సెకండ్ హీరోయి న్ పేరు..’ (మర్చిపోయినట్టుగా) అం టూ ఆయన తాగటానికి నీళ్లు అడిగి చర్చకు తెర తీశారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్‌ను ఉద్దేశించి కూడా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు సైతం ఆయన్ను విమర్శల పాలు చేస్తోంది.
కార్యక్రమంలో మాట్లాడేందుకు యాంకర్ వేదికపైకి ఆహ్వానించగా, ఆయన వచ్చి ఆమెతో కరచాలనం చేశారు. ఈ షేక్‌హ్యాండ్‌ను ఉద్దేశించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యను సైతం అందరూ తప్పు పడుతున్నారు.
మరోవైపు తన వ్యాఖ్యల్ని అన్నివర్గాల వారు మండి పడుతున్న నేపథ్యంలో దర్శకుడు త్రినాథరావు స్పందిస్తూ క్షమాపణలు కోరారు. ‘అన్షుతోపాటు నా మాటల వల్ల బాధపడ్డ మహిళలందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఎవరికీ బాధ కలిగించటం కాదు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. మీరంతా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలని కోరుతున్నా’ అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.