calender_icon.png 1 November, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ పాలనపై రైతుల కన్నెర్ర.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

16-05-2024 02:14:29 PM

హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలని ఆందోళన చేస్తున్నారు. వడ్లకు రూ.500 ల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ రైతులతోపాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొనడం జరిగిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై చెన్నూరు నియోజకవర్గ రైతులు కన్నెర్ర చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా, రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి  చెన్నూర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం మద్దతు ధరపై రూ. 500/- బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని డిమాండ్ చేశారు.