అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కుంటున్న ఆటో డ్రైవర్లను ఆదుకోకుంటే పోరాటాలు తీవ్రతరం చేస్తాం..
రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ గోడ పత్రికను ఆవిష్కరించిన తెలంగాణ ఆటో, క్యాబ్స్ డ్రైవర్స్ సంఘాల జేఏసీ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఆటో, క్యాబ్స్ డ్రైవర్స్ సంఘాల జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం (ఎఐటియుసి) హెచ్చరించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వాటి పరిష్కరానికి చొరవ చూపడంలేదని అయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 7 న తెలంగాణ ఆటో, క్యాబ్స్ డ్రైవర్స్ సంఘాల జేఏసీ రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ నిర్వహిస్తుందని వెల్లడించారు.
హైదరాబాద్ హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జేఏసీ నేతలు వి. ప్రవీణ్ (టియుసిఐ), ఎ.సత్తిరెడ్డి (టిఎడిఎస్), మీర్జా రఫాత్ బేగ్ (ఆటో ఓనర్స్ అసోసియేషన్), ఎస్. రామకృష్ణ (బిఆర్.టియు), బి, తిరుమలేష్ గౌడ్, శ్రీనివాస్, శంకర్ రెడ్డి (క్యాబ్స్ యూనియన్) లతోకలసి బి. వెంకటేశం రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఇంతవరకు కనిపించని సంక్షోభం ఆటో డ్రైవర్ల జీవనం, జీవనోపాధి అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆటో డ్రైవరుకు సంవత్సరానికి రూ. 12 వేలు ఆర్థిక సహాయం, రవాణారంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా ఆటోమీటర్ చార్జీలు పెంచాలని, మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు వల్ల ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాలని, గ్రేటర్ హైదరాబాద్ 20వేల కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని, ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించాలని, యాక్సిడెంట్ బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసారు.
ఆటో డ్రైవర్ల డిమాండ్లు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ పిలుపునిచ్చామని, ఆ రోజు సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు లక్షమంది రవాణారంగా కార్మికులతో మహా ప్రదర్శన, అనంతరం ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ ను మహా ప్రదర్శన, బహిరంగ సభ ను విజయవంతం చేయాలనీ బి. వెంకటేశం విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ఏ. బిక్షపతి యాదవ్, సిహెచ్. జంగయ్య, ఏం. కృష్ణ, లింగం గౌడ్, ఎండి. జాకిర్ తదితరులు పాల్గొన్నారు.