హైదరాబాద్,(విజయక్రాంతి): లగచర్ల దాడి ఘటనలో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 24 మందితో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి లగచర్ల కేసులో క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తామని వెంకటయ్య పేర్కొన్నారు. అమాయకులను విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతామని, ఇప్పటికీ గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనలో అమాయకులను జైల్లో పెట్టారన్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహారించారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య వెల్లడించారు.