నుమాయిష్ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): రాష్ట్ర ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతీ సంవత్సరం నిర్వహించే నుమాయిష్‌ను రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. 1938లో ప్రారంభమైన నుమాయిష్ 84 సంవత్సరాలుగా కొనసాగుతోందని, నుమాయిష్ మరింత సక్సెస్ కావాలన్నారు. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 20కి పైగా విద్యాసంస్థలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
నుమాయిష్‌లో గతంలో ఎనిమల్ కాంపిటీషన్ జరిగేదని, దాన్ని పునఃప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వస్తువులు ఈ ఎగ్జిబిషన్‌లో దొరుకుతాయని చెప్పారు. నుమాయిష్‌కు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతరావు, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు కే నిరంజన్, కార్యదర్శి బీ సురేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, కోశాధికారి డా. బీ ప్రభాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
46రోజుల పాటు నిర్వహణ
శుక్రవారం ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15వరకు అందుబాటులో ఉం ఇక్కడ దాదాపు 2వేల స్టాళ్లలో రకరకాల వస్తువులు, దుస్తులు, తినుబండారాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రతిరోజు సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు సందర్శించొచ్చు. సందర్శన టికెట్ రూ.50గా నిర్ణయించారు. ఈసారి నుమాయిష్‌ను 25లక్షల మంది సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిబిషన్ సందర్భంగా సీసీ కెమెరాలు, వలంటీర్లు, మెటల్ డిటెక్టర్లు, ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.