30-04-2025 01:25:13 AM
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): రాష్ర్టంలో ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించే యూనివర్సిటీ ఏర్పాటుకు ఆస్ట్రేలియా వాణిజ్య ప్రతినిధులు ముందు కు రావడంపై ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. తాము నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయానికి తోడు మరో ఉన్నత స్థాయి టెక్నాలజీ క్యాంపస్ అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయనన్నారు.
మంగళవారం సచివాలయంలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. కృత్రి మ మేథ వేగంగా విస్తరిస్తున్న వేళ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 3 లక్షలకు పైగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో పాటు, చదువులు పూర్తి చేసుకునే విద్యార్థులకు నూతన నైపుణ్యాల శిక్షణ అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు.
విద్య, పరిశ్రమ అవసరాలకు మధ్య నైపుణ్య లేమికి సంబంధించిన అగాథం ఉందని, దీన్ని పూడ్చగలిగే అత్యాధునిక శిక్షణ కేంద్రాలు పెద్ద ఎత్తున రావా ల్సిన అవసరం ఉందన్నారు. తమ యూనివర్సిటీ ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు సృష్టిస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు చెప్పడం బాగుందన్నారు.
అయితు పూర్తి వివరాలు, స్పష్టమైన ప్రతిపాదనతో వస్తే ప్రభుత్వ పరంగా ఏం చేయగలమనేది ఒక అభిప్రాయానికి రాగలమని స్పష్టం చేశారు. యూనివర్సిటీకి అనుబంధంగా ఇన్ క్యుబేషన్ కేంద్రాలు, పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన వాతావరణం సృష్టించడం రాష్ర్ట ప్రగతికి తోడ్పడు తుందన్నారు.
శాటిలైట్ల నిర్మాణం, డ్రోన్ టెక్నాలజీ 3-డి డిజైనింగ్, బయో సెన్సైస్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాల్లో శిక్షణ అందించడానికి కరికులమ్ సిద్ధం చేస్తామని వెల్లడించారు. తాము ఇప్పటికే టీ-వర్క్స్ లో త్రీడీ ప్రోటో టైపింగ్ సేవలు అందిస్తున్నామని, అంకుర సంస్థల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించామన్నారు.
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంలో సిడ్నీ బోర్గ్, నీలిమా చౌదరి, హైడన్ షటిల్ వర్త్, సురేన్ పథర్, యాండ్రే స్కోమన్, కొల్లా నాగ లోకేశ్ తదితరులు ఉన్నారు.