- డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో కర్ణాటకలో బెల్గాంకు
- ప్రత్యేక విమానంలో ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగొచ్చిన మంత్రులు
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): కర్ణాటకలోని బెల్గాంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ ’ ర్యాలీకి రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రానికి చెందిన మంత్రులందరూ హాజరయ్యారు. ఉద యం ప్రత్యేక విమానంలో బెల్గాం వెళ్లిన మం త్రుల బృందం.. ర్యాలీ అనంతరం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహాత్మగాంధీ బాధ్యతలు స్వీకరించి 100 సంవత్సరాలు పూర్తయిన సంద ర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సంవిధాన్ ర్యాలీని నిర్వహించారు. కాంగ్రెస్ చరిత్రే దేశ చరిత్ర అని, సమాజంలోని అన్ని వర్గాలవారికి ప్రాతినిథ్యం లభిస్తుందని మహాత్మగాంధీ చెప్పారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. ‘మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించాక దేశానికి స్వాతంత్యం వచ్చింది.
ఆ తర్వాత మనకు రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం మనందరికీ పవిత్రమైంది. మహాత్మాగాంధీ, అంబేద్కర్ చేసి న కృషిని గుర్తుచేసుకోవడంతోపాటు రాజ్యాంగాన్ని రక్షించాలి’ అని ఈ సదస్సు నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
మంత్రులు లేని రాష్ట్రంగా ఒక రోజు రికార్డు..
రాష్ట్రంలో ఒక రోజు మంత్రులెవ్వరూ లేకపోవడంతో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమ ర్శలు వెల్లువెత్తాయి. ఒక వైపు రాష్ట్రంలో గ్రామ సభలు ప్రారంభం కావడం, అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై సమావేశాలు నిర్వహిస్తుంటే.. మంత్రులుందరూ పార్టీ కార్యక్రమం పేరుతో కర్ణాటకకు వెళ్లడంపై విమర్శలు వినిపించాయి.
ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మిగతా మంత్రులందరూ ప్రత్యేక విమానంలో కర్ణాటకలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ ర్యాలీకి వెళ్లడంపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.