15-02-2025 08:41:12 PM
ఇసుక రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాల ఏర్పాటు
ఇందిరమ్మ ఇండ్లకు తీసుకొని ఉచితంగా అందించేలా చర్యలు
ఇసుక రీచ్ వద్ద అవసరమైన మేర సిసి రోడ్డు నిర్మించాలి
ఇసుక రీచ్ ల వద్ద డిస్పాచ్ లను పెంచాలి
ఇసుక రీచ్ లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్
ముత్తారం,(విజయక్రాంతి): జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్ అన్నారు. ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి, జిల్లెలపల్లి గ్రామాలలో ఇసుక రీచ్ లను రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Collector Koya Sriharsha), టిీజీఎండీసీ వైస్ చైర్మన్ బీఆర్వీ సుశీల్ కుమార్(TGMDC Vice Chairman BRV Susheel Kumar)లతో కలిసి శనివారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని, నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా జరిగే వాహనాల ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసి అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయాలని, ఇసుక రీచ్ వద్ద 400 మీటర్ల మేర సిసి రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇసుక రీచ్ ల వద్ద డిస్పాచ్ సెంటర్ లను పెంచాలని అన్నారు.
ఇసుక రీచ్ ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, లైట్స్ ఏర్పాటు చేయాలని, ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఒకే ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలని, ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లెలపల్లిలో అంగన్ వాడి కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
ముత్తారం మండలం జిల్లెలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. పిల్లలతో ముచ్చటించి వారికి పాఠ్యాంశాలను బోధించారు. ఈ తనీఖీలలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ శ్రీనివాస్, తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.