- మల్కాజిగిరి ఎంపీఈటల రాజేందర్
- కొత్తపేటలో కులగణనపై రాష్ట్ర స్థాయి సదస్సు
ఎల్బీనగర్, నవంబర్ 24: బహుజనులు ఐక్యంగా ఉద్యమిస్తూ రాజ్యాధికారం సాధించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో ఆదివారం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో కులగణన శాస్త్రీయ అవగాహనపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఎంపీ ఈటల రాజేందర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, తెలంగాణ సాహితీ అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్‌తోపాటు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్రసర్వేను పక్కాగా చేపట్టాలన్నారు. ఒకవైపు కులరహిత సమాజం కావాలని, మరోవైపు తమ కులాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ గ్రూపుల్లో చేర్చాలని ఉద్యమాలు చేస్తున్న వైవిధ్య పరిస్థితి ఉందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీరితే రిజర్వేషన్ల సమస్య ఉండదన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ.. బీసీలు సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధిస్తారన్నారు.
చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకు నేలా బీసీలు కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తోంద న్నారు. గౌరీశంకర్ మాట్లాడుతూ.. బీసీ కులాల లెక్కలు ఇప్పటికీ లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణలో కులగణన చేపట్టడం సంతోషమన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు సరైన గుర్తింపు లేదని, చట్టసభలతోపాటు ఉన్నతస్థాయి ఉద్యోగాల్లోనూ అన్యాయం జరుగు తోందన్నారు. సమావేశంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్‌యాదవ్, సోషల్ జస్టిస్ అధ్యక్షుడు చామకూర రాజు, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వళ్లకంటి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.