ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో గల రక్తనిధి కేంద్రం రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 53 రక్తనిధి కేంద్రాలు ఉండగా, ఆదిలాబాద్ రిమ్స్ రక్తనిధి కేంద్రం రాష్ట్ర స్థాయి మొదటి బహుమతి సొంతం చేసుకుంది. అత్యధిక రక్తదాన శిబిరాలు నిరహించిన భారీగా రక్త యూనిట్లు సేకరణ, రక్తహీనత, తలసేమియా, సికిల్సెల్ బాధితులు, ప్రమాద బాధితులు, గర్భిణులకు అవసరమైన రక్తాన్ని అందించటంలో ఉత్తమ సేవలను అందించినందుకు గాను ఏయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఈ అవార్డుకు ప్రకటించింది. ఈ సందర్భంగా రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో రాష్ట్ర ఏయిడ్స్ కంట్రోల్ సొసైటీ పిడి హైమావతి, ఏపీడి డాక్టర్ ప్రసాద్ చేతుల మీదుగా రక్తనిధి కేంద్రం వైద్యాధికారి మెరుగు సుధాకర్ ఆదివారం పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి పురస్కారం వచ్చేలా కృషి చేసిన రక్తనిది కేంద్రం వైద్యాధికారున్ని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ అభినందించారు.