calender_icon.png 15 October, 2024 | 3:54 PM

స్టేట్ హెల్త్ ప్రొఫైల్ సమగ్రంగా ఉండాలి

12-09-2024 12:00:00 AM

ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించండి

ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయండి

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామెదర రాజనర్సింహ

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): స్టేట్ హెల్త్ ప్రొఫైల్ సమగ్రంగా ఉండాలని, వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామెదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం రాష్ట్ర వెద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ  ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 83.04 లక్షల కుటుంబాలు ఉన్నాయని, వారిలో ప్రతి ఇంటికీ వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పారు.

హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో ఉండాలన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. కుటుంబంలో ప్రతిఒక్కరి హెల్త్ హిస్టరీ రికార్డులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వెద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో విశాలాక్షి, డీఎంఈ డాక్టర్ వాణి, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, పలువురు ప్రైవేటు హాస్పిటల్స్ ప్రతినిధుల పాల్గొన్నారు.

జీవోలు ఇచ్చి ఊరుకుంటే 

పని పూర్తయినట్లు కాదు !

గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నాలుగు మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేయడంపై బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామెదర రాజనర్సింహ ఫైర్ అయ్యారు. కేవలం జీవోలు ఇచ్చి ఊరుకుంటే పని పూర్తయినట్లు కాదని ఎద్దేవా చేశారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హడావుడిగా ఎనిమిది కాలేజీలు అంటూ జీవో విడుదల చేసి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. మంజూరైన కాలేజీలకు సంబంధించిన భవనా లు, ఆసుపత్రులు నిర్మించకుండా, వైద్యులు, స్టాఫ్ నియామకం చేపట్టకుండానే గప్పాలు కొట్టుకోవడం బీఆర్‌ఎస్ నేతలకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ కారణంగానే ఇదే కారణంతోనే ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేయలేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి అప్పీల్‌లోనే ఎన్‌ఎంసీని ములుగు, గద్వాల్, నారాయణపేట్, నర్సంపేట్ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. యాదాద్రి, మెదక్‌లో ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 220 బెడ్ల దవాఖానలను అందు బాటులోకి తీసుకొచ్చామన్నారు.