ఎమ్మెల్యే పాయల్ శంకర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో బుధవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలలో మధ్య దళారులను ప్రమేయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ది కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే చెక్కులు లబ్ధిదారులకు అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, అధికారులు ఉన్నారు.