17-04-2025 06:09:17 PM
భద్రాచలం (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో, ఒక నిరుపేద లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఏఐసీసీ సభ్యులు శ్రీ పొదెం వీరయ్య(AICC member Sri Podem Veeraiah) భోజనం చేశారు. భద్రాచలం పట్టణం ఎంపీ కాలనీ సన్నబియ్యం లబ్దిదారుడు కొండా సతీష్ ఇంట్లో జిల్లాలోని ఎస్సీ సెల్ యూత్ కాంగ్రెస్ కిసాన్ సేల్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొదేం వీరయ్య లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యులను వివరాలు అడిగారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు వాటిని తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని చెప్పిన సతీష్ కుటుంబ సభ్యులు, ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. 200 యూనిట్స్ వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుతున్నాయా అని సంక్షేమ పథకాల గురించి పొదెం వీరయ్య వారి నుంచి ఆరా తీశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తమకు ఎంతో ఉపయోగపడుతుందని కొండా సతీష్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.