- మీ ప్రతి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం
- ఖమ్మంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు
- వరంగల్‌ను రెండోరాజధానిగా అభివృద్ధి చేస్తాం: పొంగులేటి
ఖమ్మం, నవంబర్ 3 (విజయక్రాంతి): ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే మార్చి తర్వాత ఉద్యోగుల ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సకల ఉద్యోగుల కార్తీకమాస వన సమారాధన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఉద్యోగుల ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు.. ఆత్మీయ అతిథులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సీఎం రేవంత్‌రెడ్డి ధైర్యం చేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటన్నారని అన్నారు.
బ్యాలెట్ పేపర్లలో ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజల అవసరాలు గమనించే ఉద్యోగులు ఇచ్చిన తీర్పుగా ఇది భావిస్తామని చెప్పారు. ప్రజల కష్టాలను తీర్చగలిగేది ఉద్యోగులు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజలు తమకు జరిగే మంచిలో అధికారుల, ఉద్యోగుల పేర్లను గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ఉద్యోగుల కష్టాన్ని, త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు.
40 ఏళ్లుగా తన హయాంలో పనిచేసిన అధికారుల కారణంగానే ప్రజలు తనను గుర్తు పెట్టుకున్నారని, రోడ్డు వేసినా, నీటిపారుదల పనులు జరిగినా, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగుల శ్రమ ఉందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
ఉద్యోగులకు రావాల్సిన ప్రతి అంశాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అని, బాకీలను దశలవారీగా చెల్లిస్తూ ఉద్యోగులకు న్యాయంచేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఉద్యోగులకు తెలుసని, హమీలను అమలు చేస్తూనే ఉద్యోగులు నిజాయితీగా పనిచేసే శక్తి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
ఉద్యోగ సంఘాల పోరాట ఫలితమే స్వరాష్ట్రం
ప్రత్యేక రాష్ట్ర సాధనలో 204 ఉద్యోగ సంఘాలు ఏకధాటిగా పోరాటం చేశాయని, వారి పోరాట ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మార్పు కావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని ఉద్యోగులు కోరడంతో నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టంచేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగి, మహిళా, రైతు, జర్నలిస్టు వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే అవకాశం లేదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుందని, ఉద్యోగులకు భరోసా కల్పించడమే కాకుండా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని స్పష్టంచేశారు.
సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన డీఏలను క్రమపద్ధతిలో మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం చర్చించారని, ఆర్థికేతర ఇబ్బందులను వచ్చే మార్చి లోపల పూర్తి చేస్తామని అన్నారు.
రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా, వారి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాను అశ్రద్ధ చేశాయని, ప్రస్తుత ప్రభుత్వంలో ఖమ్మం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.
తమ ప్రభుత్వం ఏ ఉద్యోగిని ఎటువంటి ఇబ్బందులు పెట్టదని తెలిపారు. కొంతమంది ప్రశాంత వాతావరణాన్ని పాడుచేసే విధంగా అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖాళీలను భర్తీ చేస్తూ ఉద్యోగులపై భారం తగ్గిస్తున్నామని చెప్పారు.
సమస్యల పరిష్కారానికి సీఎం హామీ
ఉద్యోగుల ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రావడానికి ఖమ్మం జిల్లా చైతన్యం కారణమని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్ధితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి సీఎం ముందుకు వచ్చారని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గత 10 నెలల కాలంలో నిర్బంధ ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ లభించిందని అన్నారు. అనంతరం జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్నం శ్రీనివాసరావు, వనజీవి రామయ్యను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయబాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ నీరజ, జీజీవో జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేదాద్రి తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి చెరువు కబ్జాదారులను వదలం
- కేంద్రం అనుమతిస్తే అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు
- రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వరంగల్(జనగామ), నవంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణలో రెండో రాజధా నిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చారిత్రక వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.
ఆదివారం వరంగల్ లో భద్రకాళి బండ్ బ్యూటీఫికేషన్, భద్రకాళి చెరువు, బొంది వాగు వరద నివారణ, భద్రకాళి మాడ వీధుల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అంతకుముందు భద్రకాళి అమ్మవారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. భద్రకాళి చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
చెరువును సంరక్షించి తాగునీటి వనరుగా మారుస్తామని హామీఇచ్చారు. జలాశయానికి సంబంధించిన సమాచారం అధికారుల వద్ద లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. బొంది వాగు వరద నివారణకు రూ.158 కోట్లు మంజూరు చేశామని వివరించారు. చెరువులో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్య తగ్గిపోయిందని, పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు అవాంతరాలు తొలగిపోయాయని, కేంద్రం అనుమతిస్తే ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఓఆర్‌ఆర్, ఇన్నర్ రింగురోడ్డు, అండర్ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, కలెక్టర్ పీ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.