calender_icon.png 19 January, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే రాష్ట్ర బీజేపీ సారథి

19-01-2025 01:01:35 AM

  1. ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తే కానక్కరలేదు
  2. చిరంజీవి నా స్నేహితుడు.. 
  3. రాజ్యాంగంలో ఎన్ని పేజీలున్నాయో రాహుల్‌గాంధీకి తెలియదు
  4. మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చిట్‌చాట్

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): బీజేపీకి కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తే అయి ఉండాలన్న నియమమేది లేదని కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన ప్రస్తుత మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు సైతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం ఉందని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నా లేకపోయి నా అధిష్ఠానం నిర్ణయించిన వారికే బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పలు అంశాలపై మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.. వారం రోజుల్లో పార్టీ జిల్లాల అధ్యక్ష ఎన్నికలు ముగుస్తాయని ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష నియామకమేనని తెలిపారు.

మహిళలకు పార్టీ పదవుల్లో 33శాతం రిజర్వేషన్ విధా నం అమలు చేస్తున్నామని తెలిపారు. రాబో యే ఏ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పా రు. స్థానిక ఎన్నికల్లో ప్రతి చోటా తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు. 

జీహెచ్‌ఎంసీలో లైట్లు వేసే పరిస్థితి లేదు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అలివికాని హామీలు ఇచ్చి కనీసం సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితుల్లో కూడా లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో 7 నెలలుగా కనీసం వీధిలైట్లు వేసేందుకు కూడా వారి వద్ద డబ్బులు లేవన్నారు. కేంద్రం వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు సిద్ధంగా ఉందని కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో వెనకబడిందన్నారు.

తాము కష్టపడి పసుపు బోర్డు తెస్తే తమ లేఖల వల్ల వచ్చిందని ఓ మంత్రి చెప్తున్నారని... లేఖలతో పసుపు బోర్డు వస్తుందా అని ప్రశ్నించారు. అంబర్‌పేటలో ఫ్లు ఓవర్ నిర్మిస్తే కనీసం భూసేకరణ కూడా చేయకుండా తెలంగాణ సర్కారు అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు.

కేంద్రం నిబంధనల మేరకు ఉంటేనే మూసీకి నిధుల విడుదల ఉంటుందని తెలిపారు. ఇండ్లు కూలగొట్టకుండా చేసే మూసీ అభివృద్ధిని తాము స్వాగతిస్తామన్నారు. హైడ్రా కొత్తదేం కాదని.. పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. 

ఉచిత పథకాలకు వ్యతిరేకం కాదు..

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఉచిత హామీలపై మాట్లాడుతూ.. తాము ఏనాడు ఉచితాలకు వ్యతిరేకమని చెప్పలేదన్నారు. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కరెక్టు కాదని, ఆదాయ, వ్యయాలపై అంచనా ఉండి పద్ధతి ప్రకారం ఉచితాలు ఇవ్వాలన్నారు. 

చిరంజీవి నా మిత్రుడు..

సినీ నటుడు చిరంజీవికి రాజ్యసభ అవకాశం కల్పిస్తారని జరుగుతున్న ప్రచారంపై కిషన్‌రెడ్డి స్పందించారు. చిరంజీవి తనకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడని, ఆ పరిచయం వల్లే తమ ఇంటి కార్యక్రమాలకు హాజరైనట్లు వెల్లడించారు. ఆయన రాజకీయాల్లోకి మళ్లీ వస్తారని తనకు తెలియద న్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టబోయే సంవిధాన్ బచావో పాదయాత్రపై మాట్లాడుతూ.. ఆయనకు రాజ్యాంగంలో ఎన్ని పేజీలున్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 

రింగ్ రైల్ సర్వేకు నిధులు ఇచ్చాం..

రీజినల్ రింగ్ రోడ్డు మొత్తం సర్వే పూర్తయితే దాని ప్రకారంగా రీజినల్ రింగ్ రైల్ నిర్మించేందుకు సర్వే చేసే అవకాశం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు చెప్పారని పేర్కొం టూ ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చుకుంటూ పోతే సీపీఐ నారాయణ అన్నట్లుగా ఈ రోడ్డు బ్రేక్ డాన్స్ చేస్తుందని ఎద్దేవా చేశారు.

తాము రింగ్ రైల్ సర్వే కోసం నిధులు విడుదల చేశామని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్ ఫైనల్ అలైన్‌మెంట్ ఇంకా ఇవ్వలేదన్నారు. మెట్రో రైల్ రెండో దశకు తాము సహకరిస్తామని తెలిపారు. సమావే శంలో బీజేపీ నేతలు ప్రకాశ్ రెడ్డి, ఎన్వీ సుభాశ్, రాణీ రుద్రమ తదితరులు పాల్గొన్నారు.