calender_icon.png 25 October, 2024 | 9:45 AM

రాష్ట్రం బానిషా!

05-08-2024 01:30:11 AM

జడలు విప్పిన గంజాయి మహమ్మారి

  1. నగరాలు, పట్టణాల నుంచి.. ఇప్పుడు మారుమూల పల్లెలకూ... 
  2. పోలీసులు, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, ఎస్వోటీ కళ్లుగప్పి రవాణా 
  3. ఒడిశా, ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి రాష్ట్రానికి.. 
  4. జోగుతున్న యువతరం.. బాధితుల్లో మైనర్లు సైతం.. 
  5. మత్తులో నిత్యం ఏదో ఒకచోట అఘాయిత్యాలు.. భౌతిక దాడులు 
  6. డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న సర్కార్

* డ్రగ్స్ పెనుభూతం తెలంగాణ ప్రజానీకాన్ని కలవరపెడుతున్నది. నగరాలు, పట్టణాలను పట్టి పీడిస్తున్న మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెలనూ కమ్ముకున్నది. ఒకప్పుడు బడాబాబులకు పరిమితమైన డ్రగ్స్ సంస్కృతి ఇప్పుడు నిరుపేదల మధ్యకు వచ్చింది.

గంజాయి యువతను మత్తులో ముంచుతూ వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్నది. చిరుప్రాయంలోనే వారు నేరాలకు పాల్పడేలా ఉసిగొల్పుతున్నది. కుటుంబాలను ఛిద్రం చేస్తున్నది. తల్లిదండ్రుల కలలను ఛిన్నాభిన్నం చేస్తున్నది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతున్నది. దానికి బానిసై యువత అరాచకాలకు పాల్పడే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

* జగిత్యాలలో ఇద్దరు బాలురు డ్రగ్స్‌కు అలవాటు పడి,  తర్వాత ఓ మైనర్ బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన  వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో డ్రగ్స్ మత్తులో వాహనాలు నడిపిన యువకులు పలువురి మరణానికి కారణమయ్యారు. తొలుత సరదాగా డ్రగ్స్ వినియోగం ప్రారంభించిన యువత క్రమంగా వాటికి బానిసలవుతున్నారు. డ్రగ్స్ కొనేందుకు వారే విక్రేతల అవతారం ఎత్తుతున్నారు. ఆ ఊబిలో కూరుకుపోయి ఇక బయటకు రాలేకపోతున్నారు. 

ఇలాంటి సందర్భంలో అసలు రాష్ట్రానికి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మారుమూల పల్లెలకు గంజాయి ఎలా చేరుతోంది? యువత ఎందుకు మత్తుకు బానిసవుతున్నారు? అనే అంశాలతో ‘విజయక్రాంతి’ విశ్లేషణాత్మక కథనం.

విజయక్రాంతి నెట్‌వర్క్, ఆగస్టు 4 : ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన గంజాయి మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెలకూ విస్తరించింది. చిన్నవయ స్సు నుంచి కొందరు గంజాయికి బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

గంజాయి తీసుకునే వారిలో మైనర్లు కూడా ఉండటం విషాదకరం. కొందరు మైనర్లు కూడా దందాలోకి దిగి గంజాయి విక్రయిస్తూ పట్టుబడటం, లైంగిక దాడులకు పాల్పడటం వంటి దిగ్భ్రాంతికర ఘటనలు రాష్ట్రంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి.

ఇక్కడి నుంచే రవాణా..

ఏపీలోని విశాఖ జిల్లాలోని అరుకు, ఒడిశాలోని మల్కాన్‌గిరి, మహారాష్ట్రలోని గడ్చీ రోలీ, ఛత్తీస్‌గఢ్‌నుంచి తెలంగాణకు గంజా యి తరలివస్తున్నది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు కృష్ణా, గుంటూరు మీదుగా చేరుతున్నది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫా బాద్, కరీంనగర్ జిల్లాలకు మహారాష్ట్ర నుంచి, ఖమ్మం, వరంగల్‌కు ఒడిశా, ఏపీ నుంచి సరఫరా అవుతున్నది. హైదరాబాద్‌కు అన్ని ప్రాంతాల నుంచీ తరలివస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో కొందరు ఆదివాసీలకు డబ్బులు ఆశ జూపి గంజాయి పండిస్తున్నారు. పండిన గంజాయిని నిరుద్యోగులు రవాణా చేస్తున్నారు.

తెలంగాణను పీడిస్తున్న గంజాయి మహమ్మారి

నగరాలు, పట్టణాల నుంచి ఇప్పుడు మారుమూల పల్లెలకూ డ్రగ్స్

చైన్ లింక్ దందా ఇలా..

ఏపీలోని విశాఖ జిల్లాలోని అరుకు, ఒడిశాలోని మల్కాన్‌గిరి, మహారాష్ట్రలోని గడ్చీరోలీ, ఛత్తీస్‌గఢ్‌లోని అటవీప్రాంతంలో  గంజాయి పండిస్తారు. ఎత్తున కొండ ప్రాం తంలో గంజాయి ఆకులను ఎండబెడతారు. తర్వాత వాటిని ప్యాక్ చేస్తారు. గంజాయి వాసన ఇసుమంతైనా బయటకు రాకుండా ఉండేందుకే టేప్‌తో చుట్టేస్తారు. ఆ ప్యాకెట్ల ను తీసుకునేందుకు దేశంలోని వివిధ ప్రాం తాల నుంచి వస్తారు.

వారి నుంచి తయారీదారులు కిలోకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తారు. అక్కడ సరుకు తీసుకున్న వారు ప్రత్యేక వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. గంజాయి తరలిస్తున్న కారుకు ముందు వెనుక ఎస్కార్ట్ బైక్స్‌ను సైతం ఏర్పాటు చేసుకుంటారు. గమ్యస్థానానికి చేరిన తర్వాత గంజాయి ప్యాకెట్లను విప్పి 10 గ్రాములు, 20 గ్రాము ల పొట్లాలు చేస్తారు. స్థానిక యువతకు ఒక్కో ప్యాకెట్‌ను డిమాండ్‌ను బట్టి రూ.200  రూ.300 వరకు విక్రయిస్తారు. 

నిత్యం దాడులు..

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంలోని ఓ కోళ్లఫారంలో పోలీసులు దాడులు నిర్వహించి రూ.3.14 కోట్ల 31 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. జనగామలో గంజాయి విక్రయిస్తూ ఇటీవల ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాదిఇప్పటివరకు 1.60 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నా రు. జూన్ 18న హైదరాబాద్‌లో యాంటీ నార్కొటిక్స్ బ్యూరో దాడులు నిర్వహించి 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అనాజ్‌పూర్ వద్ద భువనగిరి ఎస్వోటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించి 2 లీటర్ల హాషిస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.  జూన్ 26న పంతంగి టోల్‌గేట్ వద్ద 2.80 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు పోలీసులు 2.15 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. 100కి పైగా కేసులు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2 క్వింటాళ్లు పట్టుకున్నారు.

ఇటీవల కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంతోపాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు యువకుల గంజాయి మత్తే కారణమని తేలింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండ లం తక్కళ్లపల్లిలో యువకులు సిగరేట్లలో గంజాయి తాగుతూ గ్రామస్థులకు కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుల నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు  21 కిలోల గంజాయి, కిలో ఆల్ఫాజోలం, 500 గ్రాముల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల 25కిలోల గంజాయిని పట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో గడిచిన మూడేళ్లలో 131 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  భద్రాద్రి జిల్లాలోనైతే ఈ ఏడాది మార్చి ముగిసే లోపే 278 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

కేస్ స్టడీ - 1

జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు బాలురు గంజాయికి అలవాటు పడ్డా రు. వారిలో ఒకరు బడి మానేసి ఇంట్లో ఉంటున్న బాలికతో చనువు పెంచుకున్నాడు. ఆమెకు గంజాయి అలవాటు చేశాడు. మత్తులో ఉన్న ఆమెపై తరచూ లైంగికదాడికి పాల్పడేవాడు. కొద్దిరోజుల తర్వాత వదిలే శాడు. తర్వాత బాలికకు గంజాయి ఇచ్చేవారు లేకపోవడంతో మరో బాలుడిని ఆశ్రయించింది.

అతడు కూడా గంజాయి ఇచ్చి, అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. గంజాయికి బానిస అయి బాలిక విచిత్రంగా ప్రవర్తిస్తుందని తల్లిదండ్రులు గుర్తించారు. వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్న క్రమంలో లైంగికదాడి విషయం బయ టపడింది. ఒక దశలో ఆమె మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ౩ నెలల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.  

కేస్ స్టడీ - 2

కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ముందు స్నేహితులు ఆఫర్ చేయగా సరదాగా గంజాయి అలవాటు చేసుకున్నాడు. తర్వాత గంజాయి తీసుకో వడం వ్యసనంగా మారింది. అప్పో సప్పో చేస్తూ గంజాయి కొని తాగడం ప్రారంభించాడు. ఒకదశలో ఇక ఎక్కడి నుంచీ పైసా పుట్టలేదు. చివరకు తానే గంజాయి విక్రేత అవతారమెత్తాడు.

డిగ్రీ చదువుతున్న తన ఇద్దరు స్నేహితులకు గంజాయి అలవాటు చేశాడు. వారిని విక్రేతలుగా మార్చాడు. ఈక్రమంలో ముగ్గురూ చదువుకి స్వస్తి పలికారు. పూర్తిస్థాయి గంజాయి విక్రేతలుగా మారారు. లక్షలకు లక్షలు డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. కానీ వారి దందా ఎంతో కాలం సాగలేదు. పోలీసుల చేత చిక్కి చివరకు కటకటాలపాలయ్యారు.

కేస్ స్టడీ - 3

స్నేహితులందరూ సరదాగా మద్యం తాగారు. తర్వాత వారిలో గంజాయి అలవాటు ఉన్న ఓ యువకుడి అసలు రూపం బయటకు వచ్చిం ది. గంజాయి బయటకు తీసి స్నేహితులతోనూ తాగించారు. మత్తులో ఉన్న యువకులు హల్‌చల్ సృష్టించారు. ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ నిద్రిస్తున్న రైతుపై కత్తులతో దాడి చేసి గాయపరిచారు.

ఈ ఘటన ఇటీవల నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూరులో చోటుచేసుకున్నది. ఇలా గంజాయి రక్కసి మారుమూల పల్లెలకూ చేరింది. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట యువత గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాలకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిందిపోయి కటకటాలు లెక్కిస్తున్నారు. 

రూపాలు మారుతున్న గంజాయి..

పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అక్రమార్కులు గంజాయి స్వరూపాన్ని మార్చేస్తున్నారు. గంజాయి అంటే ఎండిన గంజాయే అనుకుంటాం. ఇప్పుడు వాటిని ఆయిల్, పౌడర్, మాత్రలు, చాకెట్ల రూపంలోనూ తయారు చేస్తున్నారు. తాజాగా హైదరబాద్‌లోని సంతోష్‌నగర్‌లో యాంటీ నార్కొటిక్స్ బ్యూ రో, ఎస్వోటీ అధికారులు దాడులు నిర్వహించి 10 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల హాషిస్ ఆయిల్ పట్టుకున్న ఘటనలూ వెలుగు చూశాయి. స్మగర్లు, స్థానిక విక్రేతలకు ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులే టార్గెట్. హైదరాబాద్‌లోనైతే  టెకీలే టార్గెట్. పబ్‌లు, బార్స్, పాన్‌షాపుల్లోనూ గంజాయి దొరకుతుండడం కలకలం రేపుతోంది.

పబ్స్‌లో డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్‌లోని పబ్స్‌లో డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతోంది. ఇటీవల నగరంలోని ‘ది కేవ్ బార్ అండ్ లాంజ్’ రెస్టారెంట్‌లో యాంటీ నార్కొటిక్స్ బ్యూరో దాడులు నిర్వహించింది. 55 మందిని అదుపులోకి తీసుకుని వైద్యపరీక్షలు నిర్వహించిం ది. వీరిలో 24 మందికి పాజిటివ్ తేలింది. పబ్స్ నిర్వాహకులు ఇన్‌స్టాగ్రాం ద్వారా కోడ్ లాంగ్వేజ్ వినియోగించి బడా కుటుంబాలకు చెందిన యువత, టెకీలకు గాలం వేస్తు న్నారు.

తాజాగా హైదరాబాద్‌కు కొకైన్ రవాణా చేసేందుకు నైజీరియన్లతో సంబంధాలు నెరిపిన ప్రముఖ సినీతార రకుల్‌ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా నిత్యం నగరంలో ఏదో ఒక చోట డ్రగ్స్ వినియోగం, రవాణాకు సంబంధించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

డగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం..

మన ఊరిలో.. మన ఇంటి పక్కన గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే మనమెందుకు ఊరుకోవాలె ? మనమెందుకు మౌనంగా ఉండాలె. డ్రగ్స్ అమ్మకాలను మనమెందుకు నిర్మూలించకూడదు ? మనమెందుకు పోలీసులకు సమాచారం ఇవ్వకూడదు? మన కళ్ల ముందే సమాజం కూలిపోతుంటే ఎందుకు ఊరుకోవాలె ? మనకెందుకులే అనుకుంటే నాడు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ కోసం ఎందుకు కోట్లాడుతరు.

శ్రీకాంతాచారి, కిష్టయ్య ఎందు కు ప్రాణత్యాగం చేస్తరు? స్వరాష్ట్రం ఎందుకు తెస్తరు? డ్రగ్స్ పట్టుకుని ఎవరైనా రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటం. వారిపై ఉక్కుపాదం మోపుతం. డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీస్‌శాఖకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నం. అందుకు అవసరమైన సిబ్బందిని నియమిస్తం.

 సీఎం రేవంత్‌రెడ్డి