‘ఈ రోజు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నా..’ అంటూ సీనియర్ హీరోయిన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మంగళవారం మధ్యాహ్నం ఓ పోస్ట్ పెట్టింది. దాన్ని చూసిన అభిమానులంతా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏమైనా చెప్తారేమో అనుకున్నారు. కొందరు కొత్త సినిమా ముచ్చట అనుకుంటే, ఇంకొందరు తన ఆరోగ్యం గురించి అని భావించారు. తన అభిమాన నటి చెప్పే కబురు కోసం ఆసక్తిగా ఎదురుచూసిన వాళ్లకు సాయంత్రానికి ఎవరూ ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇచ్చింది సమంత. తాను కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టు వెల్లడించింది.
ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కు ‘న్యూ బిగినింగ్’ హ్యాష్‌ట్యాగ్‌ను సైతం జోడించింది. వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు తెలిపింది. చెన్నై జట్టుకు యజమానిగా ఉండటం ఆనందంగా ఉందని పేర్కొంది. సమంత సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ నవంబర్ 7న ఓటీటీ ద్వారా విడుదల కానుంది. కొన్ని నెలల క్రితం ప్రకటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా కూడా సమంత నుంచి రావాల్సి ఉంది. దీనికి ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.