calender_icon.png 8 October, 2024 | 10:15 AM

ఓటమితో మొదలు

05-10-2024 12:00:00 AM

కివీస్ చేతిలో భారత్ పరాజయం

  1. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టి వైఫల్యం 
  2. మహిళల టీ20 ప్రపంచకప్

ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు పేలవంగా ఆరంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి పోరులో సమిష్టి వైఫల్యంతో ఓటమి కొనితెచ్చుకుంది. మొదట బౌలింగ్‌లో దారాళంగా పరుగులు సమర్పించుకున్న హర్మన్ సేన ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చేతులెత్తేసింది. ఫలితంగా విజయంతో టోర్నీని ఆరంభించాలనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది..

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.

కెప్టెన్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్థసెంచరీతో కివీస్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించగా.. ఓపెనర్ జార్జియా ప్లిమ్మ ర్ (34), సుజి బేట్స్ (27) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2 వికెట్లు తీయగా.. అరుంధతీ రెడ్డి, ఆశా శోభన చెరొక వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 19 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ (15), రోడ్రిగ్స్ (13) మంధాన (12) దారుణంగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు నిలకడ ప్రదర్శించడంలో విఫలమయ్యారు.

న్యూజిలాండ్ బౌలర్లలో రోస్‌మేరి 4 వికెట్లతో రాణించగా, లియా తాహుహు 3 వికెట్లు, ఎడెన్ కార్సన్ 2 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన సోఫీ డివైన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది. ఓటమితో టోర్నీని ఆరంభించిన భారత్ తర్వాతి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఈ ఆదివారం ఆడనుంది.

కివీస్ దూకుడు..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకోవడంతోనే న్యూజిలాండ్ సగం విజయం సాధించి నట్లయింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కివీస్ ఓపెనర్లు సుజి బేట్స్, జార్జియా శుభారంభం అందించారు. భారత బౌలర్లను ఆడుకున్న ఈ జోడీ పవర్ ప్లే ముగిసేసరికి (తొలి 6 ఓవర్లు) 55 పరుగులు జోడించి పటిష్ట స్థితిలో నిలిపారు.

ఈ దశలో బేట్స్, జార్జియాలు వెనువెంటనే పెవిలియన్ చేరినప్పటికీ కివీస్ తన జోరును ప్రదర్శించడం మాత్రం ఆపలేదు. క్రీజులోకి వచ్చిన సోఫీ డివైన్ ఆరంభం నుంచే ఎదురుదాడి మొదలుపెట్టింది. ఏ భారత బౌలర్‌ను వదిలిపెట్టని సోఫీ బౌండరీల వర్షం కురిపించింది. 

15 ఓవర్ల వద్ద వంద పరుగుల మార్క్‌ను అందుకున్న కివీస్  చివరి ఐదు ఓవర్లలో 61 పరుగులు రాబట్టడం విశేషం. బౌలింగ్‌లో సమిష్టిగా విఫలమైన మన బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

పేలవ ఆటతీరు.. 

161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ సేన ఏ దశలోనూ లక్ష్యంగా దిశగా సాగలేదు. తొలి ఓవర్‌లో బౌండరీతో ఖాతా తెరిచినప్పటికీ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (2) కార్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్మన్ ఒక ఎండ్‌లో నిలబడేందుకు ప్రయత్నించినప్పటికీ మంధాన కూడా వెనుదిరిగింది.

ఈ దశలో హర్మన్‌కు జత కలిసిన రోడ్రిగ్స్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ పరుగులు మాత్రం జోడించలేకపోయారు. పేసర్ లియా తన వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి భారత్ ఓటమిని ఖాయం చేసింది.

క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు నిలబడేందుకు ఇష్టం చూపకుండా పెవిలియన్‌కు క్యూ కట్టడం గమనార్హం. కనీసం వంద పరుగులైనా దాటుతుందా అన్న దశలో శ్రేయాంక, ఆశా  శోభన పరుగులు సాధించి భారత్ పరువును నిలబెట్టారు. అయితే టీమిండి యా ఆలౌట్ కావడానికి పెద్దగా సమయం మాత్రం పట్టలేదు.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్ : 20 ఓవర్లలో 160/4 (సోఫీ డివైన్ 57 నాటౌట్, జార్జియా 34; రేణుకా సింగ్ 2/27),

టీమిండియా : 19 ఓవర్లలో 102 ఆలౌట్ (హర్మన్‌ప్రీత్ 15, రోడ్రిగ్స్ 13; రోస్ మేరీ 4/19).