calender_icon.png 26 November, 2024 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపుతో మొదలెట్టండి

22-11-2024 12:00:00 AM

  1. నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు
  2. రోహిత్ గైర్హాజరీలో బుమ్రాకు బాధ్యతలు
  3. కోహ్లీ, పంత్, జైస్వాల్‌పైనే అందరి కళ్లు
  4. పెర్త్ వేదికగా ఉదయం 7.50 నుంచి

* స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన టీమిండియా ఒత్తిడిలోనే బోర్డర్ గావస్కర్ సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. ఈసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కంగారూలపై టీమిండియా జోరు చూపించాలని ఆశిద్దాం.

పెర్త్: మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు అసలైన సవాల్ ఎదురుకానుంది. రోహిత్ గైర్హాజరీలో బుమ్రా నాయకత్వంలో పెర్త్ వేదికగా నేడు ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు సిద్ధమైంది. గతేడాది జరిగిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇదే భారత్‌ను ఆస్ట్రేలియా మట్టికరిపించి టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కంగారూలు అన్ని ఫార్మాట్లలోనూ బలంగా కనిపిస్తున్నారు. బోర్డర్-గావస్కర్ సిరీస్ కోసం కొందరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో పాక్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన ఆసీస్ టీ20 సిరీస్ మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై టెస్టుల్లో వారిని ఓడించడం శక్తికి మించిన పని.

అయితే గత రెండు పర్యటన్లలో (2018-19, 2020-21) ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోన్నప్పటికీ.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. పెర్త్ పిచ్ పేసర్లకు స్వర్గధామం కావడంతో ఇరుజట్లు నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశముంది. 

కోహ్లీ రాణించేనా?

టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే కోహ్లీ, రోహిత్, గిల్, పంత్ మినహా మిగతావారికి ఆసీస్ గడ్డపై ఆడిన అనుభవం లేదు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విశేషంగా రాణించిన యశస్వి జైస్వాల్‌కు ఈ సిరీస్ కీలకం కానుంది. ఆసీస్‌తో సిరీస్‌లో రాణిస్తే మాత్రం టెస్టుల్లో తన స్థానం సుస్థిరం కానుంది. ఇక పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.

కెప్టెన్‌గా కంటే ఆటగాడిగా ఉన్నప్పుడే కంగారూలపై పరుగుల ప్రవాహం సృష్టించాడు. ఆస్ట్రేలియాలో కోహ్లీకి నాలుగు టెస్టు సెంచరీలున్నాయి. అయితే కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీకి ఇదే ఆఖరి ఆసీస్ పర్యటన. తన చివరి పర్యటనలో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ధ్రువ్ జురేల్‌తో పాటు గిల్, రోహిత్ గైర్హాజరీలో అభిమన్యు ఈశ్వరన్ లేదా పడిక్కల్ ఆడే అవకాశముంది.

ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ ఉండనుండగా.. జడేజా, నితీశ్ కుమార్‌లలో ఒకరు బరిలోకి దిగే చాన్స్ ఉంది. బుమ్రా పేస్ బాధ్యతలు తీసుకోనుండగా.. సిరాజ్, ఆకాశ్ దీప్ అతడిని అనుసరించనున్నారు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, లబుషేన్, అలెక్స్ కేరీ, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్‌లతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కమిన్స్, నాథన్ లియోన్, హాజిల్ వుడ్, స్కాట్ బోలండ్ కీలకం కానున్నారు. 

భారత జట్టు అంచనా: బుమ్రా (కెప్టెన్), కోహ్లీ, జైస్వాల్, కేఎల్ రాహుల్, పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురేల్, పడిక్కల్/ ఈశ్వరన్, అశ్విన్, జడేజా/ నితీశ్, సిరాజ్, ఆకాశ్ దీప్.