calender_icon.png 5 February, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభం.. ఆ వెంటనే వాయిదా!

05-02-2025 02:22:53 AM

  1. క్యాబినెట్ భేటీ వల్ల నిమిషంలోనే వాయిదా పడిన అసెంబ్లీ, మండలి
  2. మధ్యాహ్నం తర్వాత 2.20 పునఃప్రారంభం
  3. కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
  4. మండలిలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
  5. కులగణన సర్వేకు ఇరుసభల ఆమోదం

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి):  అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకాగానే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  శ్రీధర్ బాబు మాట్లాడారు.. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మిగతా మంత్రులందరూ క్యాబినెట్ సమావేశంలో ఉన్నారని తెలిపారు.

క్యాబినెట్‌లో  సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వేపై చర్చించి నిర్ణయాలను సభలో ప్రకటన చేస్తామని చెప్పారు. అందుకోసం సభను వాయిదా వేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

అనంతరం సభ మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమైంది. సామాజిక ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానాలు, స్పష్టత ఇచ్చారు. 

మండలిలోనూ..

ఉదయం 11 గంటలకు శాసనమండలి ప్రారంభంకాగానే మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మిగతా మంత్రులందరూ క్యాబినెట్ సమావేశంలో ఉన్నారని, క్యాబినెట్‌లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వేపై చర్చించి నిర్ణయాలను సభలో ప్రకటన చేస్తామని తెలిపారు.

ఈక్రమంలోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలిని మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆతర్వాత సభ తిరిగి మధ్యాహ్నం 2.18 గంటలకు ప్రారంభమైంది. సామాజిక ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి స్పష్టతనిచ్చారు. 

సామాజిక సర్వే, వర్గీకరణకు ఆమోదం..

మండలి తిరిగి ప్రారంభమయ్యాక సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క  సభలో ప్రకటన చేయగా, వీటికి మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని తీర్మానం చేసింది.

కులగణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం 

సభ తిరిగి ప్రారంభమయ్యాక కులగణన సర్వే-2024 నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రకటన చేశారు. వాటిని సభలో ప్రవేశపెట్టారు. కుల సర్వేపై సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు. బీజేపీ నుంచి పాయల్ శంకర్, బీఆర్‌ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ సర్వే తీరుపై ప్రశ్నించారు. సాయం త్రం సర్వే నివేదికకు అసెంబ్లీ ఆమో దం తెలిపింది. తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణ న చేపట్టాలని తీర్మానం చేసింది.