- పలు ప్రాంతాల్లో ప్రారంభించిన మంత్రులు
- రేపటి వరకు ఇళ్లకు స్టిక్కర్లు.. 9 నుంచి వివరాల సేకరణ
హైదరాబాద్, నవంబర్ 6 (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే బుధవారం ప్రారంభమైంది. సర్వే కోసం ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన 80 వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు.
సర్వేలో భాగంగా 75 ప్రశ్నలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలను నమోదు చేయనున్నారు. ఈనెల 8 వరకు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ఇళ్లకు స్టిక్కరింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. అనంతరం 9 నుంచి ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలు సేకరించనున్నారు.
ఒక ఎన్యుమరేటర్‌కు 150 కుటుంబాల సర్వే బాధ్యతను అప్పగించారు. నెల రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేసేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఈ కులగణన ఆధారంగా రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను ప్రభుత్వం రూపొందించనున్న నేపథ్యంలో సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై సమగ్ర కులగణన సర్వేను ప్రారంభించారు. సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల రాజకీయ, సామాజిక అవకాశాల మెరుగుపర్చేందుకే సమగ్రమైన సర్వే చేపట్టినట్టు మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.
హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను ప్రారంభించారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. సర్వే వివరాలను గత ప్రభుత్వం మాదిరి కాకుండా పబ్లిక్ డొమైన్‌లో పెడతామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి కొండా సురేఖ కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సర్వేలో అందరూ పాల్గొనాలి: మంత్రి సీతక్క
సమగ్ర కుటుంబ సర్వేలో అంతా తప్పకుండా పాల్గొనాలని మంత్రి సీతక్క బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన జరిగితే అట్టడుగు వర్గాలకు, అభివృద్ధికి దూరంగా ఉన్న కులాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్త కులగణనకు మొదటి అడుగు తెలంగాణలో పడిందని వెల్లడించారు. ఎక్స్‌రే లాగా కులగణన జరిగినప్పుడే ప్రజల స్థితిగతులు తెలుస్తాయని స్పష్టంచేశారు.