మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే పాయం...
మణుగూరు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన పథకాల పంపిణీ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన లబ్ధిదారులను స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందించే బాధ్యత వందకు వంద శాతం తనదేనని హామీని ఇచ్చారు. ప్రస్తుతం పథకాలను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగానే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీని ఎన్నుకొని మంజూరైన పత్రాలను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతగా మంజూరైన ప్రతి లబ్ధిదారునికి ఆయా మండల అధికారులు మంజూరు పత్రాలను అందజేస్తారని తెలిపారు.
రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని అన్నారు. ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రానిపక్షంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది నిరంతరంగా కొనసాగే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు. తొలుత కరకగూడెం మండలం రేగళ్ల గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రభుత్వ పథకాల కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను అందజేశారు.
ఆ తర్వాత పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన పథకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మణుగూరు మండలంలోని లంక మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన పథకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. మణుగూరు నుంచి నేరుగా వెళ్లిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ప్రజా పాలన పథకాల పంపిణీని చేపట్టి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం బూర్గంపాడు మండలంలో ప్రజాపాలన పథకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డిఓ దామోదర్ రావు, మణుగూరు తాహసిల్దార్ రాఘవరెడ్డి ఎంపీడీవో శ్రీనివాసరావు ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, ఆయా మండలాల సంబంధిత ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.