calender_icon.png 20 October, 2024 | 12:59 AM

ఎత్తిపోతలు మొదలు

28-07-2024 05:05:27 AM

  1. ఎల్లంపల్లి నుంచి నంది మేడారానికి విడుదల 
  2. నంది పంపుహౌస్ 4 మోటర్ల ద్వారా గాయత్రికి 
  3. అక్కడి నుంచి బాహుబలి మోటర్ ద్వారా ఎస్సారార్‌కు 
  4. హర్షం వ్యక్తంచేస్తున్న ఆయకట్టు రైతులు

కరీంనగర్/ పెద్దపల్లి, జూలై 27 (విజయక్రాంతి): ఎట్టకేలకు కాళేశ్వరం జలాల ఎత్తిపోత ప్రారంభమయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ ౨లోని నంది పంప్‌హస్ నుంచి గాయత్రి పంపుహౌస్‌కు, అక్కడి నుంచి మధ్యమానేరుకు నీటి సరఫరా జరుగుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 20.093 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారానికి తరలిస్తున్నారు. 

నంది పంప్‌హస్‌లోని నాలుగు మోటర్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌కు 12 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. గాయత్రి పంపుహౌస్ నుంచి రెండు బాహుబలి మోటర్ల ద్వారా జలాలు శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) ప్రాజెక్ట్‌కు వెళ్తున్నాయి. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కూడా నీటిమట్టం పూర్తి స్థాయికి చేరకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మిడ్ మానేరుకు నీటిని విడుదల చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు.

ఈ మేరకు జలాలు విడుదల కావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 5,39,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్ట్ అధికారులు 85 గేట్లు తెరిచి అదే స్థాయిలో జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రి వర్షాలు తగ్గుముఖం పట్టకపోతే బరాజ్‌కు మరింత వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.