calender_icon.png 19 October, 2024 | 10:06 AM

తారలా.. కళాకారులా..?

28-07-2024 12:05:00 AM

పరిమితులు లేనిది కళ పరితపించేలా చేసేది కళ

అటువంటి కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కథని ఆవిష్కరించడమే.. సినిమా రంగం సైతం కళతో కూడుకున్నదే. ‘కల’ని  ‘కళ’ని ఒక్కటిగా చేసి సినీ పరిశ్రమకి తరలివచ్చి తారాస్థాయికి చేరుకున్న వారు ఎందరో. ఆ దారిన సాగుతున్నవారు మరికొందరు. రచన, నటన, సంగీతం.. నాటక రంగం నుండి రూపుదాల్చిన సినిమాలో అంతర్భాగంగా ఉంటూ చిత్ర రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కళారూపాలుగా ఉన్నాయి. కళామతల్లి బిడ్డలుగా చెప్పుకునే సినీ కళాకారులు ఆ ఒడిని చేరేందుకు ఒక రూపాన్ని ధరించినా.. కళా తృష్ణ తీర్చుకునే క్రమంలో మరిన్ని రూపాలలో ఒదుగుతారు. ఎందుకంటే.. కళకు కడ రూపం అంటూ ఉండదు. కళాకారుడికి సంతృప్తి ఉండదు. అతడు నిత్యం రగిలే కళారవి. 

ఇటీవల ‘రాయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్‌ను ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. “ఇతను నటుడా..?” అని హేళనతో మొదలైన ధనుష్ ప్రస్థానం.. “నటుడంటే ఇతడే” అన్న స్థాయికి చేరింది. ఇరవై రెండేళ్ళ సినీ పయనంలో నటుడిగా సరికొత్త పాత్రలకు ప్రాణం పోస్తూ వచ్చిన ధనుష్, తను నటించిన సినిమాలతో పాటు నిర్మాతగా చేసిన సినిమాల్లో పదుల సంఖ్యలో పాటలు రాసి, పాడారు. వాటిలో కొన్ని చిత్రాలకు అన్ని పాటలు తనే రాశారు. ఇది సినిమా పట్ల ఆయనకున్న తపన, అంకితభావానికి నిదర్శనం.

నటుడిగా తన యాభైవ చిత్రమైన ‘రాయన్’ కోసం దర్శకుడిగానూ మారిన ధనుష్, తన ఈ తాజా చిత్రం లోనూ కథకి కీలకమైన ‘అడంగాథ అసురణ్’, ‘ఓ రాయా’ పాటలకి పదకర్తగా వ్యవహరించారు. దర్శకుడిగా ‘పవర్ పాండి’ (2017) ఆయన తొలి చిత్రం. బహుముఖ ప్రజ్ఞావంతుడైన కమల్ హాసన్ ఈ కోవలోని వారే. సినిమా కోసం తెరపైనే కాదు తెర వెనుక కూడా.. మేకప్ ఆర్టిస్ట్ మొదలుకొని రచయితగా, దర్శకుడిగా, నృత్య రీతులు సమకూరుస్తూ ఎన్నో పాత్రలు పోషిస్తారాయన. రాస్తూపోతే.. తమిళంలో ప్రకాశ్ రాజ్, సిద్ధార్థ్, రాఘవ లారెన్స్ వంటి వారితో జాబితా పెద్దదే అవుతుంది.

ఇదివరకు ప్రస్తావించినట్టు తెలుగులో తారాతీరం చేరిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే తమని ఆ స్థాయికి తీసుకెళ్ళిన కళకి ఆకారం ఇచ్చే స్థితిలో మన  కళాకారులు ఎంతమంది ఉన్నారన్నదే ప్రశ్న! తమకి “సరిపడా కథలు రాసేవారెక్కడ..?” అని ప్రశ్నించే ఎంతో మంది తారలు.. తామే కథల్ని ఎందుకు సృష్టించలేకపోతున్నారన్నది ఆలోచించుకోదగ్గ విషయం. అగ్రనటులు చిరంజీవి, ఎన్టీఆర్ గాయకులిగా అలరించినా.. మిగిలన వారెవ్వరూ ఈ పరిసరాల్లోకి వచ్చింది లేదు. దర్శకత్వం నుంచి వచ్చి.. హీరోలుగా ప్రేక్షకాదరణ పొందిన రవితేజ, నాని డైరక్షన్ చేస్తామని ఎంతోకాలంగా చెబుతున్నా అవి మాటలుగానే ఉన్నాయి.

చేసినా.. ఆ ‘కథ’ల్లో వారి వంతు ఎంతన్నదీ సందేహమే. నవీన్ పొలిశెట్టి, విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యువ నటులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నా.. అవి వారి ఉనికిని నిలుపుకోవడానికే పరిమితమవుతున్నాయి. ఈ తృష్ణతో వారు ఎంతకాలం మనగలుగుతారదన్నది మరో విషయం. ఉన్నంతలో అడవి శేష్ ఓ ఆశా కిరణంలా ఉన్నారు.  రచయితలు, దర్శకులు నటులుగా మారినప్పటికీ ముద్ర వేసింది తనికెళ్ళ భరణి, ఎల్బీ శ్రీరామ్ వంటి కొద్దిమందే.

ఇప్పటి సంగతి పక్కనపెడితే.. గతంలో తెలుగు చిత్రసీమలోనూ ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటినవారున్నారు. నాగిరెడ్డి ద్వయంలోని చక్రపాణి రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు పలు సినిమాల కోసం రచయిత, దర్శకుడిగానూ పనిచేశారు. రచన, దర్శకత్వం, నటన అన్నిటా విజయపతాకం ఎగురవేశారు ఎల్.వి.ప్రసాద్. నటీమణిగా నేటికీ కీర్తిని మిగుల్చుకున్న పి.భానుమతి రామకృష్ణ.. తాను నటించిన ఎన్నో సినిమాల్లో పాటలు పాడి గాన కళని పలికించారు. సింగీతం శ్రీనివాసరావు, విబి రాజేంద్రప్రసాద్ వంటి అనువభుజ్ఙులెందరో తన ప్రతిభను ఈ పరంపరను కొనసాగించారు. 

కళాకారుడు ఇన్ని రూపాల్లోకి మారేలా ప్రేరేపించేది కథ. ఒక కథాంశం ద్వారా తాను పొందిన అనుభూతిని, అదే స్థాయిలో ప్రేక్షకులకి ఎలా అందివ్వాలి?, కళాకారుడిగా నిన్నటికంటే నేడు కొత్తగా ఎలా కనపడాలి? అనే తపన నుంచి ఈ విధమైన ప్రయత్నాలు ఆరంభమవుతాయి. ఇటువంటి ప్రయత్నాలు చేయకపోవడానికి మన తారలను కదిలించే కథలేవీ తారసపడ లేదా? అసలు అటువంటి ఉద్దేశ్యమంటూ వారికుందా? అన్నది తెలుసుకోదగ్గ కథే మరి. స్వయంపాకం తెలియనపుడు పోషణ పూర్తిగా ఆధారితమే అవుతుంది. నిర్మాణ సంస్థల రూపంలో కొత్తదనానికి అవకాశమివ్వటం అభినందించదగ్గదే అయినా.. అది కళని భరించినట్టు అవుతుందే కానీ, ధరించినట్టు కాదు కదా! ఈ విషయాన్ని గుర్తెరిగి లోలోన దాగిన తృష్ణ రగలితే.. మన కళాకారులు సైతం కళారావులు కాగలరని కాంక్షిస్తూ..

సత్యప్రసాద్